పెగడపల్లి, జూన్ 9: ఎస్సారెస్పీ కాలువలు అధ్వానంగా మారాయి. దశాబ్దాలుగా రైతన్నకు ఆదరువుగా మారి, సాగుకు భరోసా ఇచ్చిన కెనాళ్లు ప్రస్తుతం పూడికతో నిండి, ఈత, తాటి, తుమ్మ, పిచ్చి చెట్లు పెరిగిపోయి ఆనవాళ్లు కోల్పోయాయి. ప్రధానంగా పెగడపల్లి మండలంలోని డీ-76, 77 కెనాళ్ల డిస్ట్రిబ్యూటరీలు పూర్తిగా దెబ్బతిని సాగుకు నీటి సరఫరాకు ఉన్న మార్గాలన్నీ మూసుకుపోయాయి. వివరాల్లోకి వెళితే.. పెగడపల్లి మండలంలో సాగుకు ఎస్సారెస్పీ నీరే ఆధారం.
దాదాపు 21 గ్రామాల్లోని వేలాది ఎకరాలకు ఒకప్పుడు పుష్కలంగా నీరందేది. అయితే, ఇటీవలి కాలంలో కాలువలు పూడిక, పిచ్చి చెట్లతో నిండిపోయాయి. దీనికితోడు కాలువలకు అనేక చోట్ల డ్రాపులు, తూములు, బ్రిడ్జిలు కూలిపోవడంతో చుక్కనీరు కూడా దిగువకు వెళ్లడం లేదు. దీంతో రైతులు పూర్తిస్థాయి విస్తీర్ణంలో సాగు చేయలేకపోతున్నారు. కాలువలు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, ఇలా అయితే తాము ఎవుసం చేసేదెలా..? అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టిందని, చాలాచోట్ల బాగుచేసిందని, అలాగే ఇప్పుడూ చేపట్టాలని కోరుతున్నారు.