Ramagundam | కోల్ సిటీ, జూలై 6 : రామగుండం నియోజక వర్గానికి మంజూరైన ఈఎస్ఐ ఆస్పత్రి త్వరితగతిన నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వేదిక ప్రతినిధులు మద్దెల దినేష్, గోలివాడ చంద్రకళ, దుర్గం నగేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి స్థల సేకరణ, నిర్మాణంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. దీంతో అసంఘటిత కార్మికులు వైద్య సేవలకు నోచుకోవడం లేదని మండిపడ్డారు.
వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.వంద కోట్లు నిధులు మంజూరు చేసినా జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో అడుగు ముందుకు పడటం లేదన్నారు. పారిశ్రామిక ప్రాంత ప్రగతికి కార్మికుల ఆరోగ్య భద్రత అత్యంత కీలకమనీ, ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం జరిగితే వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. తక్షణమే రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి పునాది వేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో కంది సుజాత, కొండు రమాదేవి, లెనిన్, కే.రవి తదితరులు పాల్గొన్నారు.