Peddampet | అంతర్గాం, మే 26: రచ్చగుట్టలో అక్రమంగా మట్టి తవ్వకాల విషయంలో కాంగ్రెస్ నాయకులు తడి బట్టలతో పోచమ్మ గుడిలోకి వచ్చి మాట్లాడే దమ్ము ఉందా..? రచ్చగుట్టను ఎవరు కాపాడుతున్నారో, ఎవరు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని పెద్దంపేట సర్పంచ్ ఆముల పెద్ద శ్రీనివాస్, ఉపసర్పంచ్ కరవేద స్రవంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పెద్దంపేట గ్రామం రచ్చగుట్ట వద్ద మంగళవారం కాంగ్రెస్ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు.
గత నాలుగు రోజుల క్రితం కోర్టు స్టే ఆర్డర్ స్థానిక తహసీల్దార్ ఇవ్వడంతో వెంటనే మట్టి తవ్వకాలు నిలిపివేయాలని సదరు కాంట్రాక్టర్కు చెప్పడం జరిగిందనీ, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు రెండు రోజుల నుంచి తామే మట్టి తవ్వింపును ఆపివేశామని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెద్దంపేట పాలక వర్గం సదరు కాంట్రాక్టర్ వద్ద ఒక్క పైసా తీసుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు నిరూపిస్తారా అని ప్రశ్నించారు. లేదంటే తడి బడ్డలతో అందరం పోచమ్మ గుడిలోకి వెళ్లి ప్రమాణం చేద్దామనీ, అందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.
గత రెండేళ్లుగా పెద్దంపేట గ్రామ అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకవచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్, వార్డు సభ్యులు కుమార్, తమ్మనవేని శ్రీనివాస్, పైడిపల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.