ప్రజారోగ్యానికి భరోసానిచ్చే ప్రాథమిక వైద్యశాలలు చిత్తవుతున్నాయి. నిధులు రాక నీరసించిపోతున్నాయి. ‘ప్రభుత్వ వైద్యాన్ని పరుగులు పెట్టిస్తాం.. ప్రతి వ్యక్తికి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం’ అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) గుర్తింపు పొందిన ఆరోగ్య కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఎంపికైన వైద్యశాలకు మూడేళ్లపాటు ఏటా ప్రోతాహకంగా ఇచ్చే నిధులను సైతం రెండేండ్లుగా ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఈ ఏడాది అయినా వస్తాయా..? రావో అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
జగిత్యాల, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం, మంచిగా సేవలందిస్తున్న పీహెచ్‌సీలను మరింత బలోపేతం చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఎన్‌క్వాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ సిస్టమ్ విభాగం సంయుక్తంగా ఎన్‌క్వాస్ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నాయి.
ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎన్‌క్వాస్ బృందాలు పరిశీలిస్తాయి. ఆరోగ్య కేంద్రాల్లో నమోదవుతున్న అవుట్ పేషెంట్ల సంఖ్య, లేబర్ రూములు, ల్యాబ్, నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలపై కల్పిస్తున్న అవగాహన, ఆరోగ్య కేంద్రం జనరల్ అడ్మినిస్ట్రేషన్లను పరిశీలించి వాటికి మార్కులు కేటాయిస్తారు. 75 మార్కులు సాధించిన ఆరోగ్య కేంద్రాన్ని ఎన్‌క్వాస్ పరిధిలోకి ఎంపిక చేసి, ఆయా సెంటర్లకు అదనంగా నిధులు మంజూరు చేస్తారు.
నిధుల మంజూరు ఇలా..
ఎన్‌క్వాస్ పరిధిలోకి ఎంపికైన ఆరోగ్య కేంద్రాలకు ప్ర భుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం అదనంగా నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. మండల స్థాయి లో ఉన్న పీహెచ్‌సీలకు ఏటా 3లక్షలు అదనంగా మం జూరు చేయాల్సి ఉంటుంది. పట్టణ, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న పీహెచ్‌సీలకు ఏటా 2లక్షలు అదనంగా మంజూ రు చేస్తుంది. ఇక మండల స్థాయిలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు ఏడాదికి 1.26లక్షలు మంజూ రు చేయాలి.
సాధారణంగా ప్రభుత్వం పీహెచ్‌సీలకు ఏటా కేటాయించే నిధులతోపాటు ఈ ఫండ్స్ అదనంగా మంజూరు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఎన్‌క్వాస్ గుర్తింపు పొందితే మూడేండ్ల పాటు నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. మూడేండ్ల తర్వాత మరోసారి ఎన్‌క్వాస్ గుర్తింపు బృందం ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, ఎన్‌క్వాస్ స్టాండర్డ్స్‌ను కొనసాగిస్తుందా..? లేదా అని పరిశీలిస్తుంది. కొనసాగిస్తే మరో మూడేండ్ల పాటు అదనంగా నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది.
ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి..
ఎన్‌క్వాస్ ద్వారా వచ్చే అదనపు నిధుల్లో 75శాతం నిధులతో ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంటుంది. సెంటర్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు వీటిని వినియోగించాల్సి ఉంటుంది. అదనపు మందులు, దవాఖానలో వైద్య పరికరాల కొనుగోలు, మంచినీటి సౌకర్య కల్పన, మంచాల ఏర్పాటు, బాలింతలు, గర్భిణులకు వైద్య సదుపాయాల కల్పన తదితర వాటికి ఈ నిధులను ఖర్చు చేయాలని నిర్దేశించారు. ఇక మిగిలిన 25 శాతం నిధులను ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి ఇన్సెంటివ్‌లు (ప్రోత్సాహకాలు) అందించేందుకు నిర్దేశించారు.
ఉమ్మడి జిల్లాలో గుర్తింపు కేంద్రాలు
కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో పదుల సంఖ్యలో ఎన్‌క్వాస్ గుర్తింపు పొందిన ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో జగిత్యాల జిల్లాలో 17 సెంటర్లు ఉన్నాయి. అందులో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కొడిమ్యాల, కథలాపూర్, మేడిపల్లి, పెగడపల్లి పీహెచ్‌సీలు గతంలోనే ఎన్‌క్వాస్ గుర్తింపును పొందాయి. అలాగే కల్లెడ అర్బన్ హెల్త్ సెంటర్, జెఎస్ రాంవెల్ అర్బన్ హెల్త్ సెంటర్, మోతెవాడ అర్బన్ హెల్ సెంటర్ సైతం ఎన్‌క్వాస్ విభాగానికి ఎంపికయ్యాయి.
ఇక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విభాగానికి సంబంధించి ఆత్మకూర్, పైడిమడుగు, వేములకుర్తి, ధరూర్, నూకపెల్లి, రేచపల్లి, దొంతాపూర్, కట్కాపూర్ కేంద్రాలు ఎంపికయ్యాయి. మొత్తంగా 17 కేంద్రాలున్నాయి. అందులో 6 పీహెచ్‌సీలకు ఏటా 3 లక్షల చొప్పున, 3 అర్బన్ కేంద్రాలకు ఏటా 2లక్షల చొప్పున 8 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు ఏటా 1.26 లక్షల చొప్పున ప్రభుత్వం నిధు లు చెల్లించాల్సి ఉంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో నేరెళ్ల, గొల్లపల్లి, ఒడ్డెలింగాపూర్, జగ్గసార్ పీహెచ్‌సీలు ఎన్‌క్వాస్ స్టాండర్స్‌ను సాధించాయి.
పెద్దపల్లి జిల్లాలో కమాన్‌పూర్, గరిపెల్లి, రాఘవపూర్, రాగినేడు, రామగుండం, ఎలిగేడు, జూలపెల్లి, కాల్వశ్రీరాంపూర్ పీహెచ్‌సీలు ఎన్‌క్వాస్ స్టాండర్స్‌ను సాధించాయి. అర్బన్ హెల్త్ కేంద్రాల విభాగాల్లో లక్ష్మీపూర్, అడ్లగడ్ల కేంద్రాలు నమోదయ్యాయి. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి సుల్తాన్పూర్, దూళికట్ట, కల్వచర్ల, కనగర్తి కేంద్రాలు ఎన్‌క్వాస్ స్టాండర్స్ సాధించాయి. సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట, సుందరయ్యనగర్ ఆరోగ్య కేంద్రాలు ఎన్‌క్వాస్ స్టాండర్స్ సాధించాయి. మరో 7 కేంద్రాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంపికకు అర్హత సాధించాయి. కరీంనగర్ జిల్లా పరిధిలో 9 ఆరోగ్య కేంద్రాలు ఎన్‌క్వాస్ గుర్తింపునకు నోచుకున్నాయి.
రెండేళ్లుగా జాడలేని నిధులు
ఎన్‌క్వాస్‌కు సంబంధించిన నిధులు రెండేండ్లు గడుస్తున్నా రావడం లేదు. ప్రొసీడింగ్స్ ఇస్తున్న అధికారులు నిధులు మాత్రం మంజూరు చేయడం లేదని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్‌క్వాస్ గు ర్తింపు పొందిన సెంటర్లకు అదనపు నిధులు ఇచ్చే విధా నం చాలా ఏండ్ల క్రితమే ప్రారంభమైంది. అయితే కరో నా నేపథ్యంలో రెండేండ్ల పాటు ఎన్‌క్వాస్ పరిశీలన, నిధుల మంజూరు విషయాలను ప్రభుత్వం నిలిపివేసింది.
ఆ తర్వాత సంవత్సరాల్లో మాత్రం ఎన్‌క్వాస్ గు ర్తింపు పరిశీలనతోపాటు నిధుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. 2022-2023, 2023-2024 ఆర్థిక సంవత్సరాలు గడిచాయి. అందులో మొదటి ఆర్థిక సంవత్సరంలో కొన్ని పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ గుర్తింపు నిధులను విడుదల చేయగా, అవి కొన్నింటికి మాత్రమే అందాయి. చాలా ఆరోగ్య కేంద్రాలకు నిధులు రాలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయిని ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే ఇంత వరకు ఒక్క క్వార్టర్‌ను ప్రభుత్వం మంజూరు చేయలేదు.
ఈ నేపథ్యంలో ఎన్‌క్వాస్ నిధులపై ఆరా తీయగా నిధులు రావడం లేదని, అయితే ప్రోసీడింగ్స్ మాత్రం ఇస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయా..? రావడం లేదా..? అన్న విషయం తెలియడం లేదని, రాష్ట్ర ప్రభు త్వం అన్ని నిధులకు కలిపి ప్రొసీడింగ్స్ ఇస్తున్నదని, దీంతో ఏవి.. ఏ నిధులో అర్థం కాని పరిస్థితి నెలకొంద ని వారంటున్నారు. వాస్తవానికి ఎన్‌క్వాస్ ద్వారా వచ్చే నిధులను సక్రమంగా ఇస్తే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చాలా బాగా అభివృద్ధి చెందుతాయని, మౌళిక వసతులతో పాటు, వైద్య సదుపాయాలు మెరుగుపడుతాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా త్వరగా నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.