వెల్గటూర్, ఫిబ్రవరి 20: అడవిపందుల బెడద నుంచి మక్క చేనును కాపాడుకునేందుకు తాను పెట్టిన కరెంట్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు వివరాల ప్రకారం.. ఎండపల్లి మండలం సూరారం గ్రామానికి చెందిన చెల్పూరి రాజేశం (53) తనకున్న ఐదెకరాల చేనులో నాలుగెకరాలు మక్క, ఎకరం వరి వేశాడు. అడవి పందుల బెడద ఎక్కువ ఉండడంతో తాను వేసుకున్న మక్కను కాపాడుకునేందుకు చేను చుట్టూ జే వైర్‌తో కంచెను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి రోజూ సాయంత్రం కరెంట్‌కు కనెక్షన్ ఇచ్చి, తిరిగి ఉదయం తొలగించే వాడు.
ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 6 గంటలకు చేను వద్దకు వెళ్లాడు. కరెంట్ కనెక్షన్ తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తూ దానిని తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు చేరుకుని ఘటనా స్థలాకి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మపురి సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రైతులు పంటలను కాపాడుకునేందుకు కరెంట్ కంచెలు ఏర్పాటు చేసుకోవద్దని, దానికి బదులు ప్రత్యామ్నయ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాని చెప్పారు. ఇలాంటి చర్యలతో ఇతరులు మృతిచెందితే చట్టం ప్రకారం పదేండ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.