కరీంనగర్‌ను ఆనుకొని ఉన్న బొమ్మకల్‌లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములపై అక్రమార్కులు కన్నేశారు. దర్జాగా తమ భూమిలో కలిపేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక జాగలను చెరబట్టిన భూ బకాసురులపై ప్రభుత్వం ఓ వైపు విచారణ చేస్తుండగానే, మరోవైపు ఆక్రమణలకు దిగుతున్నారు. పట్టా భూముల పక్కన ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. తమ జాగ కింద రాయించుకుంటున్నారు. అందుకు రాజీవ్హ్రదారికి నాలుగు అడుగుల దూరంలో ‘సర్వే నంబర్ 58/ఎఫ్’ ఉదాహరణగా నిలుస్తున్నది. 2017 వరకు అందులో 20 గుంటలే ఉంటే.. ఆ తర్వాత ఏకంగా ఆ 1.32 ఎకరాలకు మారడం కబ్జాలకు అద్దం పడుతున్నది. తాజాగా ఇదే సర్వే నంబర్ పక్కన ఉన్న గవర్నమెంట్ ల్యాండ్‌ను ఆక్రమించే పనిలో ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపై ఫిర్యాదులు అందినా పట్టించుకోకపోవడం వల్లే ఆక్రమణలు రోజురోజుకూ పెరుగుతున్నట్టు తెలుస్తుండగా, అధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ రూరల్: కరీంనగరాన్ని ఆనుకొని ఉన్న బొమ్మకల్‌లో భూములు కోట్ల విలువ జేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్నుపడగా, ఇప్పటికే అనేకం అన్యాక్రాంతమయ్యాయి. తాజాగా వెలుగు చూస్తున్న మరిన్ని సంఘటనలు విస్తు గొలుపుతున్నాయి. ప్రభుత్వ భూములను ఆనుకొని ఉన్న సర్వే నంబర్లలో అక్రమంగా విస్తీర్ణం పెంచి కబ్జా చేస్తుండగా, రికార్డుల మార్పులే కాకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే అనేక భూములు చేతులు మారుతుండగా, తాజాగా గ్రామస్తుల ఫిర్యాదుతో మరో ఆక్రమణ వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్ 58/ఎఫ్‌లో 1954-55 నుంచి కాస్రా పహాణీలో 20 గుంటల భూమి మాత్రమే ఉన్నది. దీనికి గతంలో నలుగురైదుగురి పేరిట పట్టా ఉన్నది. ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ముల పేరిట ఉండగా, గతంలోనే ఒక విద్యాసంస్థ అధినేతకు అమ్ముకున్నారు. అయితే 2017 వరకు ఆ సర్వే నంబర్లో కేవలం 20 గుంటలే ఉండగా, ఆ తర్వాత 1.32 ఎకరాలు చూపుతున్నది. అందులో 20 గుంటలు అసలు భూమి విద్యాసంస్థల అధినేత పేరిట ఉండగా, మిగతా 1.12 ఎకరాల భూమి బొమ్మకల్‌కు చెందిన ఓ నాయకుడి అనుచరుడి పేరిట చూపుతున్నదని అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
బొమ్మకల్‌లోని సర్వే నంబర్ 58/ఎఫ్‌లోని భూమి రాజీవ్ రహదారికి కొద్ది దూరంలోనే ఉంటుంది. దీనికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 28లో 9.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అయితే పట్టా భూమి సర్వే నంబర్‌ను చూపి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే అధికారుల అండదండలతో 58/ఎఫ్‌లో లేని భూమిని చేర్పించినట్టు అర్థమవుతున్నది. సర్వే నంబర్ 28లోని ప్రభుత్వ భూమి ఇప్పటికే చాలా వరకు ఆక్రమణకు గురైంది. ఇప్పుడు ఇదేవిధంగా ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతున్నది. అయితే సర్వే నంబర్ 58/ఎఫ్‌లో కేవలం 20 గుంటలే ఉంటే.. అదనంగా 1.12 గుంటలు ఎలా చేరిందనేది? ఇప్పుడు చర్చకు వస్తున్నది. అది కూడా ఆన్లైన్లో నమోదు కావడం అంటే అధికారుల చేయి లేనిదే ఇది సాధ్యం కాదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. 2017 నుంచి 2019 వరకు ఉన్న తహసీల్ ఆఫీస్‌లో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు.
బొమ్మకల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 58/ఎఫ్‌లో జరుగుతున్న పరిణామాలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన తోట కిరణ్‌కుమార్ గత నవంబర్ 11న స్వయంగా కరీంనగర్ రూరల్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. అయినా స్పందన లేకపోవడంతో సోమవారం ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేశాడు. ఆర్డీవో ఈ ఫిర్యాదును మరోసారి తహసీల్దార్‌కు పంపించారు. అయితే ఈ సర్వే నంబర్లో అదనంగా 1.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఏ విధంగా చేరిందో ప్రధానంగా విచారణ జరపాలని బొమ్మకల్ గ్రామస్తులు కోరుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అధికారులపై ఒత్తిడి చేసి ఈ విధంగా ప్రభుత్వ భూములను కాజేసేందుకు ఆది నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, పట్టా భూమిలో అదనంగా చేర్చిన ప్రభుత్వ భూమిని తొలగించాలని కోరుతున్నారు.