Ramagundam | అంతర్గాం, ఏప్రిల్ 24: తమ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేస్తుండడంతో తాము ఉపాధి హామీ పథకాన్ని కోల్పోతామని నిరసిస్తూ సామాజిక సేవకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ లో విలీన ప్రక్రియ నేపథ్యంలో జీవో విడుదల చేసి ఉపాధి హామీ పనులు నిలిపివేయాలని ఆర్డర్ వచ్చింది.
పలువురు పని కోసం వెళ్లిన కూలీలు అక్కడే నిరసనకు దిగి కూలీలు ఆందోళన చేపట్టారు. నమ్మించి మోసం చేశారని, అభివృద్ధి పేరుతో గ్రామాన్ని గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. రామగుండం ఎమ్మెల్యే ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పారని, వారంతా తీవ్ర భావద్వేగానికి లోనయ్యారు. నిమ్మరాజుల రవి మాట్లాడుతూ.. గ్రామాన్ని మున్సిపల్ లో విలీనం చేయడం వల్ల ఉపాధి పోవడంతో పాటు ఇంటి పన్నులు కరెంటు బిల్లులు అధికంగా చెల్లించాల్సి వస్తందుని వాపోయారు.
దీంతో అంతే కాక ఇంటి నిర్మాణ పరిమిషన్ల కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని, మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలంటే దూర భారం, వ్యయ ప్రయాసలకు గురి అవు తామని ఇప్పటికే సింగరేణికి రైతులు దాదాపు 980 ఎకరాలు పంట భూములను అప్పజెప్పడంతో వ్యవసాయ ఉత్పత్తి కోల్పోయామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం విలీన ప్రక్రియను ఆపి జీవోను వెనక్కి తీసుకోవాలని, తిరిగి గ్రామపంచాయతీగా కొనసాగించాలని వారందరూ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.