కలెక్టరేట్, జూలై 27 : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని ఉపాధి హామీ క్షేత్రసహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముదిగొండ శ్యామలయ్య డిమాండ్ చేశారు. నామమాత్రపు వేతనంతో కుటుంబాలను పోషించుకుంటున్న తమకు నెలవారీ వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వరా..? అని ఆగ్రహించారు. తమకు అందేదే కొద్దిపాటి వేతనమైతే, అది నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉంచడం సబబేనా..? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం తమపై ఇంత కఠినంగా వ్యవహరించడం సముచితం కాదని సూచించారు. ఆదివారం ఆ సంఘం రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నగరంలోని కృషి భవన్లో నిర్వహించారు. శ్యామలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాలు కూడా పెంచుతామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేశారు. మేనిఫెస్టో అమలు దేవుడెరుగు కనీసం నెలవారీ వేతనాలు కూడా సక్రమంగా విడుదల చేయడం లేదని మండిపడ్డారు.
ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చిన హామీల అమలుపై స్పందించడం లేదని ఆగ్రహించారు. ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థను గతంలో మాదిరిగా సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచాలని, సాంకేతిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లతో చేసుకున్న ఒప్పందం తిరిగి పునరుద్ధరించాలని, ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస వేతనం 12,120 నుంచి 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
అలాగే ఎన్ఎంఎంఎస్ విధానాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లను ఎఫ్టీఈలుగా గుర్తించి, ఈజీఎస్లోని మిగతా ఉద్యోగులకు ఇవ్వనున్న మాదిరి పేస్కేల్ వర్తింపజేయాలని, సర్కులర్ నం.4779 ను రద్దు చేసి, తొలగించిన క్షేత్రసహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు దమ్మని లక్ష్మణ్, సాయేందర్, ఆనంద్, ఉమ్మడి జిల్లా బాధ్యులు పత్తెం యాదగిరి, గడ్డం రమేశ్, వేల్పుల మల్లన్న, మధు, జంగపల్లి మల్లేశ్, స్వర్ణలత, రాధ, వెంకటస్వామి, వెంకటేశ్, యాదగిరి, కొండన్న, తిరుపతితో పాటు 200 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.