ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిపి వేసిన ఉద్యోగులు, బుధవారం ఉదయం నుంచి సమ్మెకు దిగారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని డిపోల ఎదుట నిరసనలు తెలిపారు. అక్కడే బైఠాయించి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అద్దె, ఎలక్ట్రికల్ బస్సులు నడిపించేందుకు అధికారులు శత ప్రయత్నాలు చేశారు. అంతే కాకుండా శిక్షణ లేని తాత్కాలిక డ్రైవర్ల చేతికి బస్సులు ఇచ్చి నడిపించారు. ఈ కారణంగా కరీంనగర్ రెండో డిపోకు చెందిన అద్దె బస్సు రాంపూర్ వద్ద లారీని ఢీ కొనగా, 38 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. సమ్మె విషయం తెలియని చాలా మంది ప్రయాణికులు ఎప్పటిలాగే బస్టేషన్లకు వచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు.
ఆర్టీసీ ఉద్యోగులు కొంత కాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇటు ప్రభుత్వం, అటు యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. రెండు చోట్ల నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. బుధవారం ఉదయం ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు బలవంతంగా పోలీస్ పహారాలో అద్దె బస్సులు నడిపేందుకు ప్రయత్నించగా, అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాము యాజమాన్యం ముందు పెట్టిన 32 డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను గుర్తు చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండు వేతన సవరణలు అమలు చేయడంతోపాటు యూనియన్లు ఏర్పాటు చేసి, ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి జేఏసీతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని ఉద్యోగులు చెప్పారు. జగిత్యాలలో ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగుల నిరసనకు జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులతో కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని, బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా అపాయింట్ డే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
టికెట్ లేకుండా ప్రయాణం
కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో 11 డిపోల నుంచి 410 వరకు అద్దె, ఎలక్ట్రానిక్ వాహనాలు నడిపినట్లు అధికారులు ప్రకటించారు. సమ్మెతో మిగతా 556 బస్సులు డిపోలకే పరిమితం కాగా, అద్దె బస్సుల్లో పనిచేసే కండక్టర్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు. అయితే అధికారులు మొండితనంతో కండక్టర్లు లేకుండా, టికెట్లు తీసుకోకుండానే బస్సులు నడిపేందుకు ప్రయత్నించారు. టిమ్ మిషన్లపై అవగాహన లేకున్నా కొన్ని అద్దె బస్సు డ్రైవర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇటు మహిళలకు, అటు పురుషులకు కూడా టికెట్లు ఇవ్వకుండానే గమ్యస్థానాలకు చేర్చారు.
పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, మంథని ఆర్టీసీ డిపోల నుంచి కొన్ని బస్సులను ప్రైవేట్ డ్రైవర్లతో టికెట్లు ఇవ్వకుండానే ఉచితంగా నడిపారు. సమ్మె పుణ్యమాని తమకు ఫ్రీ ప్రయాణం దొరికిందని పురుష ప్రయాణికులు సంతోషపడ్డారు. ఇటు అధికారులు గురువారం నుంచి బస్సుల సంఖ్యను మరింత పెంచే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తున్నది. శిక్షణ లేకున్నా హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లను తీసుకొని, ఆర్టీసీ బస్సు స్టీరింగ్ వీళ్ల చేతిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ఇంకోవైపు కండక్టర్లకు తాత్కాలికంగా శిక్షణ ఇచ్చి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైవర్‌కు రోజుకు వెయ్యి, కండక్టర్లకు 800 చెల్లిస్తామని అధికారులు ప్రకటన ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తున్నది.
కరీంనగర్లో ప్రమాదం
ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు నిరసనలు తెలుపుతుండగా, మరోవైపు అధికారులు మాత్రం బలవంతంగా అద్దె, ఎలక్ట్రికల్ బస్సులు నడిపించారు. అయితే కండక్టర్ లేకుండా డ్రైవర్లతో నడిపేందుకు పట్టుదల ప్రదర్శించారు. టిమ్ మిషన్ ఆపరేటింగ్ రాని అద్దె బస్సు డ్రైవర్‌కు ఇచ్చి వరంగల్ రూట్లో పంపించారు. రాంపూర్ బైపాస్ వద్దకు వెళ్లగానే డ్రైవర్ శ్రీధర్ బస్సు నడిపిస్తూనే.. టిమ్ మిషన్‌తో ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వెళ్తున్న లారీని గమనించకుండా వెనకనుంచి ఢీ కొట్టాడు.
బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్‌తోపాటు 38 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖానాకు తరలించి చికిత్స అందించారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆరోపించారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తున్నదని, శిక్షణ లేని వారితో బస్సులు నడిపించడం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన ప్రయాణికులు, డ్రైవర్‌ను కూడా కనీసం పరామర్శించకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని మండిపడ్డారు.
ప్రయాణికులకు ఇబ్బందులు
సమ్మెతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమ్మె విషయం తెలియక చాలా మంది ఎప్పటిలాగే తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్టేషన్లకు చేరుకున్నారు. అక్కడకు వచ్చిన తర్వాత బస్సులు నడవకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గంటల కొద్దీ పడిగాపులు గాశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఇక్కట్లు పడ్డారు. కొన్ని రూట్లలో పల్లె వెలుగు కింద అద్దె బస్సులు నడపినా.. చాలా రూట్లలో నడవని పరిస్థితి నెలకొన్నది.
ఈ కారణంగా జమ్మికుంట, హుస్నాబాద్, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, గోదావరిఖని రూట్లలో బస్సులు లేక పిల్లా పాపలతో వచ్చిన ప్రయాణుకులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక వైపు బస్సులు లేక పోవడం, మరో వైపు ఎండ తీవ్రత కారణంగా గోస పడ్డారు. దూర ప్రాంతాల విషయానికి వస్తే కరీంనగర్ నుంచి హైదారాబాద్ జేబీఎస్ వరకు ఎలక్ట్రానిక్ బస్సులను మాత్రమే నడిపారు. అయితే సరిపడా బస్సుల్లేక పోవడంతో ఇక్కట్ల పాలయ్యారు. ముఖ్యంగా గోదావరిఖని, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి తదితర రూట్లలో సరిపడా బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆశ్రయించారు.