TVVP medical employees | కోరుట్ల, అక్టోబర్ 10: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని శుక్రవారం కోరుట్ల ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ సకాలంలో జీతాలు రాక తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారన్నారు.
బ్యాంకులలో హౌసింగ్ లోన్ తీసుకున్న ఉద్యోగులు, ఆడపిల్లల పెళ్లిళ్లకు తీసుకున్న లోన్లతో సరైన సమయంలో అప్పు కట్టలేక బ్యాంకు మేనేజర్ల ఒత్తిడి తట్టుకోలేక మానసిక ఇబ్బంది పడుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ విభాగంలో డాక్టర్స్ మొదలుకొని అన్నీ క్యాడర్ల వైద్య సిబ్బందికి, మినిస్టీరియల్ సిబ్బందికి నేటికీ వేతనాలు అందలేదన్నారు. ప్రతీ నెలా 10 నుంచి 15 తేదీ వరకు వేతనాల చెల్లింపులు జాప్యం జరుగుతుందని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీతాలు సకాలంలో అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. 010 ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సునీత రాణి, జూనియర్ అసిస్టెంట్లు రాజశేఖర్, నాచయ్య, వైద్య సిబ్బంది సరళ, ప్రమీల, కవిత, శ్రీధర్, చారి, సురేందర్, చిరంజీవి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.