
Dharmaram | ధర్మారం, డిసెంబర్18: పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దాగేటి రాజేశ్వరి ప్యానల్ అభ్యర్థి 10వ వార్డు సభ్యుడు ఎలిగేటి మల్లేశం ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఎన్నిక సజావుగా జరగడంతో టెన్షన్ తొలగిపోయింది. రెండో విడత లో భాగంగా ఈనెల 14న ధర్మారం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ గా దాగేటి రాజేశ్వరి తో పాటు 14 మంది వార్డు సభ్యులు ఎన్నికయ్యారు.
సర్పంచ్ ఎన్నిక పూర్తయినంతరం అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరగాల్సి ఉండగా ఉప సర్పంచ్ పదవి కోసం పలువురు పోటీ పడడంతో కోరం లేకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. ఆ తర్వాత మరుసటి రోజు ఈ నెల 15న ఎన్నికల అధికారి రవి ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కానీ సమావేశానికి సమయం గడువులోగా వార్డు సభ్యులు ఎవరు హాజరు కాకపోవడంతో ఉప సర్పంచ్ ఎన్నిక తాత్కాలికంగా వాయిదా పడింది. దీంతో ఉప సర్పంచ్ ఎన్నిక మరో మూడు నెలల పాటు జరగదని విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడానికి స్థానిక ఎంపీడీవో, ఏడీఈఏ ఐనాల ప్రవీణ్ కుమార్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసి సర్పంచ్ తో సహా వార్డు సభ్యులందరికీ సమాచారాన్ని అందజేశారు. దీంతో గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ ఎన్నిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తో పాటు సహాయ ఎన్నికల అధికారి ఎంపీవో రమేష్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఉపసర్పంచ్ ఎన్నిక సమావేశానికి ఉదయం 11 గంటల సమయంలో సర్పంచ్ దాగేటి రాజేశ్వరి తోపాటు మరో 8 మంది వార్డు సభ్యులు ఎలిగేటి మల్లేశం, దుర్గం అంజయ్య, నార ప్రేమ్ సాగర్, సోగాల తిరుపతి, సల్వాజీ రాజమణి, కాంపల్లి రత్నకుమారి, తుమ్మల మల్లమ్మ, బొమ్మగాని సతీష్ కుమార్ హాజరయ్యారు.
12వ వార్డు సభ్యుడు నార ప్రేమ్ సాగర్ ఉప సర్పంచ్ పదవి కోసం వార్డు సభ్యుడు మల్లేశం పేరును ప్రతిపాదించగా దీనిని మరో వార్డు సభ్యుడు సోగాల తిరుపతి బలపరిచారు. దీంతో సర్పంచ్ రాజేశ్వరి, మరో ఏడుగురు వార్డు సభ్యులు మొత్తం ఎనిమిది మంది చేతులెత్తి మద్దతు తెలపడంతో ఉప సర్పంచ్ గా మల్లేశం ఎన్నికైనట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. దీంతో టెన్షన్ తొలగిపోయింది. ఎన్నిక ప్రక్రియ పూర్తయిన అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ రాజేశ్వరిని, కొత్తగా ఎన్నికైన ఉప సర్పంచ్ మల్లేశంను సర్పంచ్ రాజేశ్వరి కుమారుడు దాగేటి ఉదయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఇద్దరికీ పూలమాలలు వేసి సన్మానించారు.