ఎడతెరిపిలేని వాన
మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి జనజీవనం స్తంభించింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురువడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
- నగరంలో పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు
- బల్దియా ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరం
- పర్యవేక్షించిన మేయర్, కమిషనర్
- పలు గ్రామాల్లో మత్తడి దుంకుతున్న చెరువులు
- ఆనందంలో అన్నదాతలు
కార్పొరేషన్/ హుజూరాబాద్/ సైదాపూర్/ ఇల్లందకుంట/ చిగురుమామిడి/ శంకరపట్నం/మానకొండూర్ రూరల్, జూలై 21: మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి జనజీవనం స్తంభించింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురువడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోగా.. మరికొన్ని చోట్ల రోడ్లపైకి నీరు చేరింది. అలాగే చైతన్యపురి, భగత్‌నగర్ ప్రాంతంలో చెట్లు విరిగిపడ్డాయి.
భగత్‌నగర్ ప్రాంతంలో ఓ విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయింది. చైతన్యపురిలో చెట్టు విరిగి అక్కడ నిలిపి ఉన్న కార్లపై పడడంతో స్వల్ప నష్టం జరిగింది. కాగా, నగరంలోని విద్యానగర్, రాంనగర్, శర్మనగర్, మంచిర్యాల చౌరస్తా, భగత్‌నగర్, రాంపూర్, బైపాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. అలాగే నగరంలోని శివారు ప్రాంతంలోని రేకుర్తి, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లోని పలు కాలనీల్లో మురుగు కాల్వల వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోగా ప్రజలు అవస్థలు పడుతున్నారు.
అప్రమత్తమైన నగరపాలక సంస్థ
నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. సమస్యలు తలెత్తిన చోట డీఆర్ఎఫ్ బృందాలతో తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా చైతన్యపురిలో చెట్లు విరిగిపడడంతో వెంటనే స్పందించి వాటిని తొలగించారు. అలాగే భగత్నగర్లోనూ చెట్లు, విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. రాంపూర్, బైపాస్‌రోడ్డు, రాంనగర్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోగా, ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీల ద్వారా నీరు సులువుగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. బైపాస్ రోడ్డులో సీసీ పైపులు వేయడంతో వర్షం నీరు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పైపులను తవ్వి కచ్చ కాల్వలను ఏర్పాటు చేశారు.
ప్రజల రక్షణే ధ్యేయం: మేయర్
నగరవాసులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రజలందరి రక్షణే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని మేయర్ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నుంచే మేయర్ నగరంలో పలు చోట్ల పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. 33వ డివిజన్ భగత్‌నగర్ వాటర్ ట్యాంకు సమీపంలో విద్యుత్ స్తంభం నేలకొరగడంతో నగరపాలక సంస్థ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి సరి చేయించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థలో 9849906694 కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎకడ ఇబ్బంది కలిగినా కాల్ సెంటర్‌కు సమాచారం అందించాలన్నారు. మూడు డీఆర్ఎఫ్ బృందాలతో ప్రత్యేక నోడల్ అధికారుల పర్యవేక్షణలో 64 మంది సిబ్బందితో నగరంలో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వర్షాలతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎక్కడా ఇబ్బందులు రానివ్వం: కమిషనర్
నగరంలో వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా అని చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, చేపడుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే కాల్ సెంటర్‌కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమాల్లో డీఈలు వెంకటేశ్వర్లు, ఓం ప్రకాశ్, అయూబ్ ఖాన్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీహరి, నవీన్, రాజు, ఎన్వీరాన్మెంట్ ఇంజినీర్ స్వామి, ఏఈలు గట్టు స్వామి, గఫూర్, పారిశుధ్య అధికారులు గట్టు శ్రీనివాస్, వెంకన్న, నర్వోత్తం, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ డివిజన్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో వాగులు ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. హుజూరాబాద్‌లో 7.86 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. పట్టణ సమీపంలోని చిలుకవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. రంగనాయకులగుట్టకు వెళ్లేదారిలో గల గుండ్లచెరువు వరదనీటితో కళకళలాడుతున్నది. మామిండ్లవాడ, బుడిగ జంగాల కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లల్లోకి వరద వచ్చింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. రెండు మూడ్రోజుల్లో వరినాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు.
ఇల్లందకుంట మండలంలోని చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకున్నాయి. బోగంపాడు కొత్త చెరువు మత్తడి పడుతుండగా, సిరిసేడు, బుజూనూర్, మల్యాల, ఇల్లందకుంట, చిన్నకోమటిపల్లి, టేకుర్తి చెరువులకు జలకళ వచ్చింది. మల్యాల వాగులోని చెక్ డ్యాంలు అలుగుపడుతున్నాయి. చెరువులు, కుంటలకు జలకళ రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం వద్ద సందర్శకుల తాకిడితో సందడిగా మారింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జెండా గుట్ట నుంచి వస్తున్న నీటి ప్రవాహం పర్యాటకులను ఆకర్షిస్తున్నది. కాగా, జలపాతం వద్దకు వెళ్లేందుకు రాయికల్ గ్రామం నుంచి రోడ్డు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటకుల కోసం రహదారి నిర్మాణం చేపట్టాలని సింగిల్‌విండో డైరెక్టర్ చాడ ప్రకాశ్‌రెడ్డి కోరారు.
చిగురుమామిడి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ముదిమాణిక్యం, నవాబ్ పేట్, సుందరగిరి తదితర గ్రామాల్లో వరి పంటలు నీట మునిగాయి. కుంటలు, చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. రేకొండ నుంచి మొగిలిపాలెం, ఎగ్లాస్పూర్ గ్రామాల మధ్యలో గల కల్వర్టుల పైనుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇందుర్తి-ఒగులాపూర్ మధ్య గల ఎల్లమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
శంకరపట్నం మండలం కేశవపట్నం నుంచి అర్కండ్ల వరకు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలు నిండి పారుతున్నాయి. ముత్తారం రామసముద్రం చెరువుతో పాటు కేశవపట్నం పెద్ద చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. లింగాపూర్, మెట్పల్లి, తదితర చెరువుల్లోకి వరద నీరు చేరుతున్నది. ఈ సీజన్లో ఆలస్యంగానైనా ఆశించిన మేర వర్షాలు కురుస్తుండడంతో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మానకొండూర్ మండలంలోని పలు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. దేవంపల్లి ఊర చెరువు (పాల చెరువు), శ్రీనివాస్ నగర్‌లోని బర్లాం చెరువులు మత్తడి పడుతున్నాయి. ఆయా చోట్ల మత్స్యకారులు చేపలు పడుతున్నారు. దేవంపల్లి చెరువుతో పాటు ఈదులగట్టెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వరద ప్రవహించడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

