కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కరెంటు లేక అల్లాడుతున్నాయి. రోజుకు ఐదారు గంటలకుపైగా కోతలతో ఆగమవుతున్నాయి. మొన్నటి మొన్న గెలిచిన కర్ణాటకలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. తమకు అధికారమిస్తే విద్యుత్ కష్టాలు తీరుస్తామంటూ అక్కడ ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఇప్పుడు విద్యుత్ కోసం ఒకటి రెండు వర్గాలు కాదు, సబ్బండ వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. అయితే ఇదంతా ఎవరికీ తెలియదన్నట్టు.. కర్ణాటకను చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెబుతున్నది. ఇప్పటికే సాగుకు మూడు గంటలే చాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కసారిగా రైతులు భగ్గుమనడంతో మాట మార్చి, తమ ప్రథమ ప్రాధాన్యం కరెంటే అని నమ్మబలుకుతున్నది. కానీ, సబ్బండవర్గాల ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ కటిక చీకట్లు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. 58 ఏండ్లలో కటిక చీకట్లు తప్ప కరెంటు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారని గుర్తు చేస్తున్నారు. కానీ, కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం రెండేళ్లలోనే తెలంగాణను విద్యుత్ రంగంలో దేశానికే దిక్సూచిగా నిలిపారని కొనియాడుతున్నారు. రాష్ట్రంలో నిరంతర వెలుగులు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్నే గెలిపించుకోవాల్సిన అవసరమున్నదని ఉమ్మడి జిల్లా రైతులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. తప్పిపోయి కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కష్టాలు కొనితెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు.
కరీంనగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత 41 ఏండ్లు కాంగ్రెస్, 17 ఏండ్లు టీడీపీ పాలించింది. కానీ, ఆ పాలనలో కరెంటు కష్టాలు ఎదుర్కోని వర్గం లేదు. ఏ రంగంలో చూసినా ఇక్కట్లు తప్పలేదు. వ్యవసాయరంగానికి తొమ్మిది గంటలు ఇస్తామని చెప్పడమే తప్ప ఏనాడూ నాలుగు గంటలకు మించి ఇవ్వలేదు. అది కూడా వేళాపాలా ఉండకపోయేది. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రైతులు అరిగోస పడినా.. అర్ధరాత్రి కరెంట్‌తో ప్రాణాలను పణంగా పెట్టినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఎంతో మంది రాత్రి పూట పొలాలకు వెళ్లి పాముకాటుతోనో.. కరెంట్ షాక్‌తోనో చనిపోయినా కనీస భరోసా ఇవ్వలేదు. పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ఇవ్వడమే కాదు, పీక్ అవర్స్‌లో విద్యుత్ వాడొద్దని ఆంక్షలు విధించేది. పరిశ్రమలు కుదేలై వేలాది మంది ఉపాధి కోల్పోతున్నా లెక్కచేయలేదు. గ్రామాలకైతే కేవలం రాత్రిపూట లైటింగ్ కోసమే సరఫరా చేసేది. పొద్దంతా కరెంటే ఉండేది కాదు. పట్టణాల్లో ఎక్కడ చూసినా పొద్దంతా జనరేటర్ల మోతలే వినిపించేవి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య దుకాణ సముదాయాలపై అధిక భారం పడేది. కరెంట్ లేక వ్యాపారాలు సాగేవి కాదు. తీవ్ర నష్టాలను చూసేది. గృహ వినియోగదారులకు నిత్యం కోతలు విధించే వారు. కరెంట్ లేక ఇంట్లో ఉండని పరిస్థితి కనిపించేది. ఇలా ప్రతి రంగం కరెంట్ ఇక్కట్లతో ఆగమైంది.
కారుతోనే కరెంటు సాధ్యం
58 ఏండ్ల సమైక్య పాలనలో కరెంటు కోసం అరిగోస పడ్డ ప్రజలు.. స్వరాష్ట్రంలో సాధించిన ఫలాలను కండ్లారా చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎవరినీ కదిలించినా.. కరెంటు ఉండాలంటే కారుకే పట్టం కట్టాలంటూ ఘంటాపథంగా చెబుతున్నారు. కేసీఆర్ ఉంటేనే భవిష్యత్‌లో కరెంటు కష్టాలు కనిపించకపోవడంతోపాటు మిగులు రాష్ట్రంగా ఉంటుందంటున్నారు. అదే కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలు వస్తే విద్యుత్ రంగం మళ్లీ సంక్షోభంలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుమ్ములాటలు ఉండే పార్టీల వల్ల కరెంటు కష్టాలే కాదు, ప్రతి రంగం ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. దూరదృష్టితోపాటు ప్రజలకు మేలు చేయాలన్న తపన, సంక్షేమ ఫలాలను అందించాలన్న అకుంఠిత దీక్ష ఉన్న నాయకుడు ప్రస్తుతం కేసీఆర్ మాత్రమే కనిపిస్తున్నారని, అందుకే అతి తక్కువ సమయంలో తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని విభిన్న వర్గాలకు చెందిన నిపుణులు చెబుతున్నారు. 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉండాలని, ఇది తమకో వరం లాంటిదని, అందుకే కేసీఆర్ వెంటే ఉంటామని రైతులు ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంట్ ఖతమైనట్టేనని, మళ్లీ ఆ కష్టాలు రావొద్దని చెబుతున్నారు. ఇప్పటికే కర్ణాటకలో డబ్బులిచ్చి కొందామన్నా కరెంటు దొకరని పరిస్థితి ఉందని, కానీ మన రాష్ట్రం విద్యుత్తు కాంతులతో వెలిగిపోతున్నదని పేర్కొంటున్నారు.
రెండేళ్లలోనే విద్యుత్ విజయం
రాష్ట్ర విభజన సమయంలో కరెంట్ లేక తెలంగాణ చీకటి అవుతుందని చెప్పిన ఆంధ్రా పాలకులకు చెంప పెట్టులా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్తు రంగాన్ని సంస్కరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండేళ్లలోనే కరెంట్ కష్టాలను దూరం చేశారు. అతి తక్కువ కాలంలోనే పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఆ తర్వాత గృహ వినియోగదారులకు కూడా నిరంతర విద్యుత్‌ను సరఫరా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 6 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత 7 గంటలకు పెంచారు. అనంతరం 9 గంటలు ఇచ్చారు. 2018 జనవరి 1 నుంచి 24 గంటలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ రంగం.. ఈ రంగం అని కాదు, అన్ని రంగాలకూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సాగుకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే కాగా, రైతులు మంచి దిగుబడులు తీస్తున్నారు. పరిశ్రమల్లోనూ లక్ష్యానికి మించి ఉత్పత్తులు సాధిస్తున్నారు.
అంతరాయం లేకుండా..
నాటి సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న కరెంట్ కష్టాలను స్వరాష్ట్రంలో దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యుత్ రంగాన్ని మెరుగు పర్చేందుకు 650 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడం, విద్యుత్ ఉప కేంద్రాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, పాత ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ఉప కేంద్రాల సామర్థ్యం పెంచడం, అంతర్గత లైన్ల నిర్మాణం, కొత్తగా విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి పనులు చేశారు. ఫలితంగా 2014లో ఉమ్మడి జిల్లాలో 218 విద్యుత్ సబ్స్టేషన్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 353కి చేరింది. ట్రాన్స్ఫార్మర్లు చూస్తే 2014లో కేవలం 53,247 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 78,979కి పెరిగింది. అప్పటికీ ఇప్పటికీ విద్యుత్ వినియోగం చూస్తే.. 2014లో కేవలం 1,093.36 మెగావాట్ల వినియోగం ఉంటే.. ప్రస్తుతం 3,328.86 మెగావాట్ల వినియోగం జరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలో నెలవారీగా వినియోగం భారీగా పెరిగినా ఎక్కడా అంతరాయం కలుగకుండా విద్యుత్ సరఫరా చేయడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత. ఉమ్మడి జిల్లాలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 165 కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేసింది. ప్రణాళికాబద్ధంగా లైన్లను బలోపేతం చేసింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ల ఫెల్యూర్ శాతాన్ని తగ్గించింది. 2014-15లో 9 శాతం ఉన్న ఫెల్యూర్స్ ఇప్పుడు 1.3 శాతానికి తగ్గాయి. గాలి దుమారం, వర్షాలు కురవడం, పిడుగులు పడడం వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగానే ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయే తప్ప లోవోల్టేజీ వల్ల కాదని అధికారులు చెబుతున్నారు. 2014లో వ్యవసాయ కనెక్షన్లు 3,39,298 ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 4,18,505కు పెరిగింది.
కరెంట్ సమస్యే లేదు
మేం ఇండస్ట్రీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంట్ సమస్యే రాలే. మెంటెనెన్స్ కోసమని నెలలో ఒక్క రోజు అట్ల గంట.. రెండు గంటలు ఇంట్రాప్షన్ వస్తంది. అంతకు మించి సమస్య లేదు. ఇండస్ట్రీని ప్రోత్సహించాలంటే సరైన కరెంట్ ఉండాలె. అది ఒక్క తెలంగాణలోనే సాధ్యమైతంది. ఇప్పుడు ఇతర రాష్ర్టాల పరిస్థితి చూస్తున్నంగదా.. ఒకప్పుడు మన పరిస్థితి ఇట్లనే ఉండె. పరిశ్రమల నిర్వాహకులు చాలా కష్టపడ్డరు. నడుప లేక చాలా మంది ఇండస్ట్రీస్ మూసేసుకున్నరు. ఇప్పుడు ఏ చిన్న పరిశ్రమైనా పెట్టుకొని తమకు తాము బతుకొచ్చు. నలుగురికి ఉపాధి కల్పించవచ్చు. అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ ఫస్ట్ కరెంట్ సమస్యను పరిష్కరించిన్రు. కరెంట్ ఎప్పుడొస్తదో ఎప్పుడు పోతదో అప్పట్లో తెలిసేది కాదు. ఇప్పుడు కరెంట్ పోవుడు అనే ముచ్చటే లేకుంట పోయింది. ఇతర రాష్ర్టాల్లో కరెంట్ గురించి నాకు పెద్దగా తెలియదుకానీ, ఇక్కడ ఉన్నట్లు అయితే ఉండదని అనుకుంటున్న. ఎందుకంటే కేసీఆర్ సార్‌లాంటి నాయకులు అక్కడ లేరు. అది మాత్రం చెప్పగలను. కేసీఆర్ చొరవతోనే ఇప్పుడు మాలాంటి చిన్న పరిశ్రమలు నడుస్తున్నయ్. నలుగురికి ఉపాధి దొరుకుతంది. కరెంట్ సరిగా లేకపోతే పరిశ్రమలు ఇట్ల నడిచేవి కాదు. ఇంత మందికి ఉపాధి దొరికేది కాదు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ సార్ ఉంటేనే అన్ని తీర్ల మంచి జరుగుతదని నేను భావిస్తున్న.
– ఎం శ్రవణ్, సోపా మేకింగ్ ఇండస్ట్రీ మేనేజర్
మేం పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు
నేను 30 ఏండ్లుగా లేత్ మిషన్ వర్క్ చేస్తున్న. మా నాన్న కూడా ఇదే పని చేస్తుండె. ఇన్నేండ్లు ఏ ఒక ప్రభుత్వమూ కరెంటు సమస్య గురించి ఆలోచించలేదు.. పరిషరించలేదు. తెలంగాణ వచ్చినంక ఏడాదిలనే కరెంట్ సమస్య చాలా వరకు తగ్గింది. ఇదంతా కేసీఆర్ చలవే. గతంలో పరిశ్రమ రంగానికి చాలినంత కరెంటు సరఫరా ఉండకపోయేది. దీంతో మేం పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. అప్పుడు జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు తప్పనిసరైనయ్. పదేపదే మోటర్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పటాకుల లెక్క పేలిపోయేవి. పవర్ హాలిడేలతో పరిశ్రమలు మూసుకున్నం. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని అప్పటి పాలకులు ఎద్దేవా చేసిన్రు. కానీ, వారి అంచనాలు తలకిందులైనయ్. రాష్ట్రం ఏర్పడే నాటికి పగటిపూట మూడు గంటలు, రాత్రిపూట మూడు గంటలు పవర్ కట్ ఇబ్బందులుండగా, సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా ఎదిగింది. క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు అనే మాటే లేదు. ఉదయం దుకాణానికి వచ్చి సాయంత్రం దాకా కరెంట్ పోకుండా ఉన్న రోజులు ఇప్పుడు కనిపిస్తున్నయ్. దీంతో పాటు, లేత్‌మిషన్ మీద పని కోసం వచ్చేవారికి సులభమైంది. కరెంట్ ఉండడంతో పని చేయించుకుని తొందరగా ఇంటికి వెళ్తున్నరు. మాకు కూడా సులువైంది. నిరంతరాయంగా కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్‌ను మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
నిరంతరం సేవలు అందిస్తున్నం
ఇప్పుడు 24 గంటల కరెంటు ఉండడంతో రైతులకు సేవలు అందిస్తున్నం. గతంల రైతుల మోటర్లు గానీ, పైపులు గానీ బాగు చేయాలంటే కరెంట్ లేక రోజులు గడిచేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక 24 గంటలు కరెంటు ఉంటుంది. రైతులకు గంటల వ్యవధిలోనే పని చేసి ఇస్తున్నం. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఉండడం వల్ల సాగు నీరు పుష్కలంగా అందుతున్నది. దీంతో రైతులు ఎక్కువ సాగు చేస్తున్నరు. వారికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి పనులు చేస్తున్నం.
– ఎర్రోజు గోపాల్ చారి, లేత్ మిషన్ వర్క్‌షాప్ (ఇల్లంతకుంట)
కరెంట్ కష్టాలు తప్పినయ్
నాకు రెండున్నర ఎకరాల భూమి ఉన్నది. తెలంగాణ రాకముందు బావిలో నీళ్లున్నా కరెంట్ రాక సగం పంట ఎండిపోయేది. తెల్లాందాక బాయికాడనే పడుకునేది. కానీ రాష్ట్రం అచ్చినంక కరెంట్ కష్టాలు తప్పినయ్. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పంటలకు
నీళ్లు పెట్టుకుంటున్నం. వరి, మక్క, పసుపు పంటలకు పగటి పూటనే నీటి తడి అందిస్తున్నం. సీఎం కేసీఆర్ వల్లే కరెంట్ మంచిగా వస్తుంది. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే అంతా చీకటే.
– లవంగ రాజేందర్, రైతు, అమ్మక్కపేట
కరెంటుతో కుల వృత్తులకు జీవం
మా నాన్న బ్రహ్మయ్య నేను చిన్నగా ఉన్నప్పుడే పెద్ద బరిసెలు, ఉలులతో వడ్రంగి పని చేసేది. కానీ, సాంప్రదాయ పద్ధతులలో వడ్రంగి పని చేయడం కొంత శారీరక శ్రమతో పాటూ పనిపరంగా త్వరగా పూర్తయ్యేది కాదు. నేను డిగ్రీ వరకు చదువుకున్న. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతే కావడంతో మా నాన్నకు సహాయంగా కులవృత్తి చేయాలనుకున్న. కానీ, పాతతరంలా కాకుండా కొంత వినూత్నంగా.. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా కంప్యూటర్ ఆధారంగా చకినం చేసే పనులు చేయాలనుకొన్నా. వెంటనే మల్యాలలోని కటికవాడలో ఓ షటర్ అద్దెకు తీసుకున్న. ఆ సమయంలోనే మాకు తెలిసిన ఒకాయన కులవృత్తి చేసుకునే వారికి కేటగిరీ-4 ప్రకారం విద్యుత్‌శాఖ మీటర్ అందజేయడంతోపాటు బిల్లులో రాయితీ ఇస్తారని చెప్పిండు. నా ఆర్థిక పరిస్థితి అంతంతే కావడం.. దుకాణం నడుస్తుందా? లేదా అని ఓ సందేహం ఉండె.
ఈ సమయంలనే మా సర్పంచ్‌ను అడిగిన.. వుడ్కార్వింగ్ (చకిణం) దుకాణం పెట్టాలనుకుంటున్న.. నడుస్తాదాయె అని అడిగితే బ్రహ్మాండంగా నడుస్తది.. సీఎం కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తున్నడు.. నీ పనికి ఏం ధోకా ఉండదని చెప్పిండు. దీంతో వెంటనే మరునాడు దుకాణం ప్రారంభించిన. నాలుగేళ్ల నుంచి నా వుడ్కార్వింగ్ దుకాణం నిరంతరాయంగా నడుస్తుండడంతో పాటూ ప్రభుత్వం అందజేస్తున్న విద్యుత్ రాయితీని వినియోగించుకుంటున్న. గిరాకీ కూడా బాగా వస్తంది. కరెంట్ ఉండడం వల్లే పనులు అయితున్నయ్. డిజైన్లు కంప్యూటర్ ద్వారా ఇవ్వడంతో లేజర్ మిషన్‌తో చక్నం చెక్కడం వల్ల త్వరగా పనులు చేయలుగుతున్న. ఇటీవల కులవృత్తులకు సహకారం అందిస్తున్నరనే సమాచారం తెలిసి బీసీ బంధుకు దరఖాస్తు చేసుకుంటె లక్ష రూపాయల చెక్కు వచ్చింది. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు ఇస్తున్న కరెంటు వల్లనే మాలాంటి కుల వృత్తులు జీవం పోసుకుంటున్నయ్. ఇట్లా కులవృత్తులను ఆదుకునుడు పొరుగు రాష్ర్టాల్లో ఎక్కడుంది? కేసీఆర్ సార్ జాతీయస్థాయి రాజకీయాల్లో రానిస్తే దేశవ్యాప్తంగా ఇక్కడి లెక్క పథకాలు అమలైతయ్.
– ఉంగురాల రాకేశ్ చారి,వుడ్ కార్వింగ్ నిర్వాహకుడు (మల్యాల)
మంచి కూలీ దొరుకుతంది
మాది సిద్దిపేట జిల్లా మేడిపల్లి. నేను అల్యూమినియం డోర్స్ మేకింగ్ వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న. ఒకప్పుడు పని లేక చానా కష్టపడ్డం. ఈ తొమ్మిది పదేండ్ల సంది ఎక్కడికి వోయినా పని దొరుకుతంది. మంచి కూలీ దొరుకుతంది. నాలుగు మెతుకులు దొరుకుతున్నయ్. ఎప్పుడో ఒకసారి అట్లవోయి ఇట్లచ్చుడు తప్ప కరెంట్ 24 గంటలు ఉంటంది. మేం సుతం పొద్దుగాల తొమ్మిది పది గంటలకు వచ్చి ఐదారు గంటల దాకా పనిచేసుకుంటున్నం. వెయ్యికి తక్కువ పని దొరుకుత లేదు. తెలంగాణ వచ్చినంకనే కరెంట్ ఇట్ల ఉంటంది. మా వర్క్‌షాపుల ఉత్తరప్రదేశ్ వాళ్లు సుతం పనిచేస్తరు. వాళ్లు చెప్తే విన్న. అక్కడ ఇట్ల కరెంట్ ఉండదట. వాళ్లు ఇక్కడికి వచ్చి మంచిగ సంపాయించుకుంటున్నరు. మన రాష్ట్రం లెక్క కరెంట్ ఎక్కడుండదని నాకు అర్థమైంది. మళ్ల కేసీఆర్ సార్ వస్తెనే కరెంట్ మంచిగుంటది. మా అసోంటోళ్లకు ఇంత పని దొరుకుతది.
– సాగొండ నాగరాజు, అల్యూమినియం డోర్స్ వర్కర్
కరెంటు కోతలతో మస్తు బాధలు పడ్డం
మాది అసలే చిన్న టైలర్ షాపు.. మాలాంటి షాపులకు కరెంటే ప్రధానం. కరెంట్ లేకపోతే కాళ్లతో తొక్కీ తొక్కి బట్టలు కుట్టి చాలా అలిసి పోయెటోళ్లం. దీని వల్ల ఓ వైపు సమయం ఎక్కువయ్యేది.. మరో వైపు కాళ్లు నొప్పులు పుట్టేవి. రోజుకు 8 బ్లౌజ్‌లు కుట్టుకునే మేం కరెంట్ కోతలతో రెండు, మూడు కూడా కుట్టక పోయేది. సమయానికి బట్టలు అందించకపోవడంతో గిరాకీ ఎక్కువ రాక ఇబ్బంది పడే వాళ్లం. ఒక్కో నెలలో మా షాపు అద్దె కూడా భారమయ్యేది. కుటుంబ పోషణ ఇబ్బంది కలిగేది. కానీ, బీఆర్ఎస్ సర్కారు వచ్చిన తరువాత కరెంట్ కోతలు పూర్తిగా లేకుండా పోయినయ్. రోజుకు ఎన్ని బట్టలు వస్తే అన్ని కుట్టుకుంటున్నం. అందరికీ సమయానికి బట్టలను అందిస్తున్నం. మా కుటుంబానికి అవసరమైన పైసల్ సంపాదిస్తున్నం. ఇదంతా కేవలం కరెంట్ కోతలు లేక పోవడం వల్లనే సాధ్యమైతంది.
-మాడిశెట్టి రమాదేవి, టైలర్ షాపు నిర్వాహకురాలు (మంథని)
అప్పటి బాధలు పోయినయ్
గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయానికి 9 గంటల కరెంటు అని చెప్పి మూడు గంటలు కూడా సక్కగ ఇచ్చే వాళ్లు కాదు. దాంతోటి రెండెకరాల పొలం కూడా తడవక పోయేది. చానా తిప్పలు పడేది. కరెంట్ అచ్చుడు, పోవడుతోటి పగలు, రాత్రి పొలం చుట్టే తిరిగేది. అచ్చిన కరెంట్ లోవోల్టేజీ, హైవోల్టెజీతో వచ్చేది. దీంతో స్టార్టర్లు, మోటర్లు, వైర్లు కాలేది. ఎలక్ట్రీషియన్ల షాపుల చుట్టూ, ఇండ్ల చుట్టూ రిపేర్ల కోసమే తిరిగేది. ఇప్పుడు ఆ బాధలు లేవు. 24 గంటల కరెంట్ వస్తున్నది. ఏ బాధ లేకుండా సరిపోయే అన్ని నీళ్లు పారిస్తున్నం. లో, హై వోల్టేజీల బాధలు లేవు. మోటర్లు, స్టార్టర్లు కాలే కష్టాలు లేవు. వ్యవసాయాన్ని చాలా సంబురంగా చేసుకుంటున్నం.
– నీళ్ల లక్ష్మణ్, రైతు (మంథని)
ఇక్కడిలెక్క కరెంట్ ఉండది
మాది ఉత్తర్‌ప్రదేశ్‌ల చిన్న ఊరు. ఇక్కడి లెక్క అక్కడ కరెంట్ ఉండది. ఊర్లళ్లనైతే పొద్దంతా ఒకటి రెండు గంటలు ఇస్తరు. రాత్రి అయితెనే కరెంట్ ఉంటది. ఇండస్ట్రీకి కరెంట్ సరిగ్గా ఇవ్వరు. అక్కడ ఎప్పుడు గొడవలు జరుగుతయ్. కరెంట్ సరిగ్గా ఉండక పనులు దొరుకుడు కష్టంగ ఉంటెనే ఇక్కడికి వచ్చి బతుకుతున్నం. నేను ఇక్కడికి వచ్చి ఏడాదైతంది. ఏదో ఒక పని దొరకుతుందనే ధీమా కొద్ది వచ్చిన. సోపా సెట్టు తయారు చేసే పని నేర్చుకున్న. ఇప్పుడు ఇదే పని చేస్తున్న. మా ఊరు నుంచి నలుగురైదుగురం వచ్చినం. అక్కడొకలు.. అక్కడొకలు పనులు చేసుకుంటున్నరు. వచ్చి కొద్ది రోజులే అయినా చేతినిండ పని దొరుకుతంది. ఇక్కడి లెక్క మా రాష్ట్రంల కరెంట్ ఉంటే నాలాంటోళ్లకు అక్కడే పని దొరికేది. కూలీ కోసం ఇంత దూరం వచ్చే పని ఉండేది కాదు. ఇక్కడ ఉన్నట్లు మాకు అక్కడ సదుపాయాలు ఉండవు. మాకు కొంత భూమి ఉంది. సాగు చేసుకుందామంటే నీళ్లుండయి. ఇక్కడి లెక్క వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇవ్వరు. వచ్చినప్పటి నుంచి చూస్తన్న ఇక్కడ చాలా బాగుంది.
– నూర్హక్, ఉత్తరప్రదేశ్ వాసి, సోఫా సెట్ మేకింగ్ ఇండస్ట్రీ కార్మికుడు (కరీంనగర్)
కేసీఆర్ సార్‌లాంటి లీడర్ ఉండాలి
కాంగ్రెస్ వస్తే రాష్ట్రంల కరెంట్ పని ఖతమే. తెలంగాణ రాక ముందు పరిస్థితి ఎట్లుండె. మళ్ల గదే చుక్కలు కనిపిస్తయి. అప్పుడు కరెంట్ కోసం ఎంత కష్ట పెట్టిన్రు. ఎవ్వలన్నా పట్టించుకున్నరా..? తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ నాణ్యమైన కరెంట్ ఇస్తున్నరు. మాలాంటి పరిశ్రమల నిర్వాహకులు లాభపడుతున్నరు. ఇప్పుడు పక్క రాష్ర్టా లను చూస్తే అక్కడ పరిశ్రమలు మూత పడుతున్నయ్. కర్ణాటకల పీక్ ఆఫ్‌లు ఇస్తున్నరు. మహారాష్ట్రల వారానికి రెండ్రోజలు పరిశ్రమలు బంద్ పెడుతున్నరు. మరీ మన తెలంగాణల ఎట్లున్నది. అర్థం చేసుకోవాలె. తెలంగాణ వచ్చినంక మొదటి ఏడాది నుంచే ఇండస్ట్రీకి 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుంట నడుస్తున్నయి. రోజు రోజుకూ కరెంట్ మెరుగు పడుతున్నది. నాణ్యమైన కరెంట్ ఇస్తున్నరు. రాష్ట్ర ప్రజలకు కష్టాలు లేకుంట చేస్తున్నరు. ఇతర రాష్ర్టాల్లో కేసీఆర్ సార్ లాంటి లీడర్ ఉండాలి కదా. ఉంటే మన లెక్కనే కరెంట్ వస్తది, నీళ్లు వస్తయ్. అన్నీ వస్తయ్. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరు లక్షల యాభై వేలు పెట్టి జనరేటర్ కొనుక్కున్న. ఇప్పుడు దాన్ని మూలకు పడేసిన. దాంతోని పనే పడ్తలేదంటే ఇక్కడ కరెంట్ పరిస్థితి ఎట్లున్నదో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ లాంటి లీడరే మళ్ల ఉండాలె. జనం కూడా అదే కోరుకుంటున్నరు.
– ఎండీ లతీశ్, హుమెరా ఇండస్ట్రీ నిర్వాహకుడు (కరీంనగర్)
మా రాష్ట్రంల రాత్రే ఉంటది
ఉత్తరప్రదేశ్‌ల ఇక్కడి లెక్క 24 గంటల కరెంట్ ఉండది. టౌన్లలో నిత్యం కోతలు ఉంటయి. గ్రామాల్లో అయితే రాత్రి మాత్రమే ఇస్తున్నరు. కరెంట్‌ను ప్రైవేట్ చేసిండ్రని ఇప్పుడు అక్కడ పెద్ద గొడవలు జరుగుతున్నయి. నేను ఇక్కడికి వచ్చి ఐదారేండ్లు అవుతోంది. ఎప్పుడో ఒకసారి వెళ్లి వస్త. పోయినప్పుడల్లా ఇక్కడికి ఎప్పుడు పోదామా అనిపిస్తది. నా పుట్టిన స్థలం అనే అభిమానం ఉన్నా.. ఇక్కడికే రావాలనిపిస్తది. ఇక్కడ కరెంట్ ఉండడం వల్ల మంచి పని దొరుకుతంది. నేను అల్యూమినియం డోర్స్ మేకింగ్ చేస్తా. మా దగ్గర ఈ డోర్స్ పెట్టుకునే వాళ్లే ఉండరు. పెట్టుకున్నా చాలా ధర ఉంటది. కరెంట్ లేక పోవడంతో ఇలాంటి పనులు అక్కడ దొరనే దొరకవు. రాత్రి కరెంట్ ఇస్తే పరిశ్రమలు నడుపుకోనివ్వరు. ఇగ పనులు ఎట్ల నడుస్తయి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మంచిగ పనులు దొరుకుతున్నయి. ఇక్కడనే అల్యూమినియం డోర్స్ మేకింగ్ పని నేర్చుకున్న. ఎంత చేసుకున్నా ఒడవని పని ఉంటది ఇక్కడ. అందుకే ఇక్కడి నుంచి వెళ్లబుద్ధి కాదు.
– రియాజ్, ఉత్తరప్రదేశ్ వాసి, అల్యూమినియం డోర్స్ మేకింగ్ వర్కర్
నాటి పాలనలో అరి గోస పడ్డం
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం అరిగోస పడ్డం. మళ్ల తెలంగాణలో కాంగ్రెస్ వస్తే నిండా మునుగుతం. అప్పుడు మేము పడ్డ బాధలు అంతా, ఇంతా కావు. ఎవుసం చేసుడుకంటే కైకిలి, కూలీకి పోవుడు మంచిదనిపించేది. కాంగ్రెసోళ్లు రోజుకు తొమ్మిది గంటల కరెంట్ ఇత్తమని చెప్పి, మూడు గంటలు కూడా సరిగా ఇచ్చేటోళ్లు కాదు. అది కూడా రాత్రి, పగలు ఎప్పుడొచ్చేదో తెలిసేది కాదు. నిద్రహారాలు మాని పొలాల కాడనె పండుకునేటోళ్లం. రాత్రి పురుగు, పాములతో భయమయ్యేది. అచ్చిన కరెంట్ సక్రమంగా ఉండక, లోఓల్టేజీతో మోటర్లు నీళ్లు పొయ్యకపోయేవి. అవి కాలిపోయి దండగ ఖర్చు పెట్టెటోళ్లం. ట్రాన్స్ఫార్మర్లు గూడా కాలిపోతే రోజుల తరబడి మళ్లోటి ఇచ్చేటోళ్లే కాదు. గిలాంటి కరెంట్ గోసలతో యాసంగి పంటలు మస్తుగా ఎండిపోతే, పశువులను మేపుకునేటోళ్లం. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక కేసీఆర్ సార్ సీఎంగా రావడంతో మా బతుకులు మారినయ్. మొదటగా కరెంట్ బాధలు తీర్చిండు. ఎన్నికల్లో అన్న ప్రకారం 24 గంటలు కరెంట్ ఉత్తగనే ఇత్తండు. నాకు 8ఎకరాల ఎవుసం భూమి ఉంది. 24గంటల కరెంట్తోటి రెండు బావులతో నాలుగు దిక్కుల పైపులు వేసుకుని ఏ బాధ లేకుండా నీళ్లు పారించుకుంటన్న. గిప్పుడు నా ఇట్టం వచ్చినప్పుడు పొలం దగ్గరికి పోయి నీళ్లు పెట్టుకునే సౌలతు ఉంది. రైతుల కోసం కేసీఆర్ సార్ అన్నీ చేత్తండు. కరెంట్ ఒక్కటే కాకుండా విత్తనాలు, ఎరువులు అవసరమైనన్ని దొరికేట్లు చేత్తండు. గట్లనే సాగు నీళ్లకు ఢోకా లేకుండా చెరువులు, కుంటలను అభివృద్ధి చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్తోటి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు ఇత్తండు. వడ్డీలోళ్లకాడికి పోకుండా రైతుబంధు ఇత్తండు. పంటలను అమ్ముకునేందుకు ఊర్లళ్లనే కొనిపిత్తండు. రైతులు ఎవరన్న అనుకోకుండా చనిపోతే గూడా ఆ కుటుంబం ఆగం కాకుండా బీమా చేయించి రూ.5లక్షలు అచ్చేట్లు చేసిండు. ఇది ముమ్మాటికీ తెలంగాణ సర్కార్ ఘనతే. రైతులందరం కేసీఆర్ సార్నే గెలిపించుకుంటం.
– పాకాల సంపత్‌రెడ్డి, రైతు, కొలనూర్(ఓదెల)