విద్యుత్‌శాఖ స్పాట్ బిల్లింగ్ సిబ్బంది తప్పుదోవలో పోతున్నది. కాసుల కక్కుర్తితో ప్రభుత్వ ఆదాయానికే గండికొడుతున్నది. రాష్ట్ర సర్కారు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వాడుకున్న పేదలకు ఫ్రీ కరెంట్ ఇస్తుండగా, పరిమితి దాటిన వారికి సైతం జీరో బిల్లు ఇప్పిస్తామంటూ వసూళ్ల పర్వానికి దిగుతున్నది. ఇందులో ఒక పద్ధతిలో బిల్స్ కొట్టే క్రమంలో యూనిట్లు తక్కువగా ఎంటర్ చేయడం, మరో పద్ధతిలో తమ ఆఫీస్‌లోని కంప్యూటర్ సెక్షన్లో సిబ్బందితో మాట్లాడి రీడింగ్ అవకతవకలకు పాల్పడుతున్నది. ఒక్కో వినియోగదారుడి నుంచి రూ.200 నుంచి రూ.300 తీసుకుంటూ జేబులు నింపుకుంటున్నట్లు సొంత శాఖలోని సిబ్బంది నుంచే ఆరోపణలు వెల్లుత్తుతుండగా, పట్టని ఉన్నతాధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది.
పెద్దపల్లి, మే 10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పేదల కోసం గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 200 యూనిట్లలోపు వాడుకున్న వారికి జీరో బిల్లు ఇస్తున్నది. పథకం కింద పెద్దపల్లి జిల్లాలో ఎన్పీడీసీఎల్ సరిల్ పరిధిలోని 1.76 లక్షల మంది అర్హులుగా ఉన్నారు. ప్రతి నెలా స్పాట్ బిల్లర్స్ ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీసి బిల్లు ఇస్తుంటారు. సాధారణంగా వేసవిలో వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఏసీ, కూలర్ ఎక్కువగా వాడే ఇంట్లో రీడింగ్ 200 యూనిట్లు దాటిపోతుంటుంది. అయితే, ఇదే అదనుగా పలువురు స్పాట్ బిల్లర్స్ జేబులు నింపుకొంటున్నారు. పరిమితి దాటిన వారికి జీరో బిల్లు ఇప్పిస్తామంటూ వసూళ్ల పర్వానికి దిగుతున్నారు.
ఎన్పీడీసీఎల్ సరిల్లోని పెద్దపల్లి, మంథని డివిజన్ల పరిధిలోని ఈ తంతు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. 200 నుంచి 300 యూనిట్ల మధ్యలో రీడింగ్ నమోదైతే జీరో బిల్లు వచ్చేలా చేస్తామంటూ సంబంధిత వినియోగదారుడి వద్ద బహిరంగంగానే రూ.200 యూనిట్లు నుంచి రూ.300 వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు ఒక పద్ధతిలో బిల్స్ కొట్టే క్రమంలో యూనిట్లు తక్కువగా ఎంటర్ చేయడం, మరో పద్ధతిలో తమ ఆఫీసులోని కంప్యూటర్ సెక్షన్లో సిబ్బందితో మాట్లాడి రీడింగ్‌ను కుదిస్తున్నారని, ఎన్పీడీసీఎల్ సిబ్బంది బహిరంగంగా చెబుతున్నారు. సంబంధిత ఏఈ, ఏఈడీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తతంగం నడుస్తుందని విమర్శిస్తున్నారు.
బిల్లింగ్‌లో ఐఆర్డీఏ పద్ధతి, ఓసీఆర్ పద్ధతిలో తీసుకుంటే ఇలాంటి అవకతవకలు జరగడానికి వీలు లేదు. 95 శాతం జిల్లాలో ఆ రెండు పద్ధతుల్లోనే బిల్లింగ్ జరుగుతున్నది. కేవలం ఐదు శాతం మాత్రమే మాన్యువల్‌గా జరుగుతున్నది. అయితే, గృహ జ్యోతిలో ఎలాంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండానే చూస్తున్నాం. 190 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు వచ్చే బిల్లులను ప్రత్యేకంగా తనిఖీలు చేస్తాం. ఏవైనా తేడాలుంటే సరి చేస్తాం. ఎవరు డబ్బులు అడిగినా వినియోగదారులు ఇవ్వవద్దు.
– మాధవరావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ (పెద్దపల్లి)