కార్పొరేషన్, నవంబర్ 24: తెలంగాణను అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో, అభివృద్ధిని అడ్డుకునే కాంగ్రెస్, బీజేపీ కావాలో ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 20, 21, 2వ డివిజన్లలో శుక్రవారం ఆయన ప్రచారం చేశారు. మంత్రి గంగులకు స్థానిక మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆరెపల్లిలో యువత బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో రోడ్లు లేక, తాగునీరు అందక, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. స్వరాష్ట్రంలో వేల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని రోడ్లను సుందరంగా మార్చామని, నగరంలో ప్రతి వాడకు రోజూ మంచినీటి సరఫరా అందిస్తున్నామని తెలిపారు.
కేసీఆర్ పాలనలో రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పచ్చని తెలంగాణను చూసి ఆంధ్రోళ్లకు కడుపు మంట మొదలైందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ ముసుగులో కిరణ్ కుమార్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్, షర్మిల, కేవీపీలు హైదరాబాద్‌లో అడ్డా వేశారని విమర్శించారు. మా ఆస్తులు ఇకడే ఉన్నాయని, హైదరాబాద్ సంపద మాదే అంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఓడిపోతే ఆంధ్రా నాయకులు ఇక్కడ మళ్లీ పెత్తనం చేసి బతుకనివ్వరని హెచ్చరించారు.
కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి కేసీఆర్‌ను ఓడిస్తే నష్టపోయేది మనమేనని పేర్కొన్నారు. తెలంగాణను కాపాడుకోవాలంటే కేసీఆర్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుందని, కరీంనగర్ టికెట్ ఓ రౌడీషీటర్‌కు ఇచ్చిందన్నారు. ఆయనపై ఇప్పటికే 32 భూకబ్జా కేసులు ఉన్నాయని, ఆయనను గెలిపిస్తే మన భూములు ఉంటాయా అని ప్రశ్నించారు. బండి నాపై రెండు సార్లు ఓడిపోయి గుండె పోటు డ్రామాతో ఎంపీగా గెలిచాడని విమర్శించారు. గెలిచిన తర్వాత ఎప్పుడైనా ప్రజలకు కనిపించారా అని ప్రశ్నించారు.? కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తెచ్చి అభివృద్ధి చేయలేకపోయాడని దుయ్యబట్టారు. ఆ పార్టీలో చేసిన అవినీతికి ఉన్న రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఊడబీకారని, మళ్లీ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఎలాగు ఇవ్వరని తెలిసి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎంపీగా బండి సంజయ్ నాలుగున్నర ఏండ్లు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.
బీసీ బిడ్డ తుల ఉమకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి తర్వాత ఇతరులకు అమ్ముకున్నారని విమర్శించారు. ఎంపీగా నాలుగున్నర ఏళ్లుగా సంపాదించిన అక్రమ డబ్బులతో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుద్దామని చూస్తున్నాడని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓటుకు రూ.20 వేలు, సెల్‌ఫోన్ ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
తాను కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు ఈడీ, ఐటీ అధికారులను పంపించి, నా ఇంటి తాళాలను పగులగొట్టించారని మండిపడ్డారు. తనపై అక్కసుతోనే ఐటీ దాడులు చేయించాడని విమర్శించారు. తెచ్చుకున్న తెలంగాణను ఆంధ్రా దొంగల, ఢిల్లీ నాయకుల చేతుల్లో పెట్టొదన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. నాకు పెద్ద పదవి వస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.
కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, టీటీడీ ఆలయం, ఇస్కాన్ టెంపుల్, మెడికల్ కళాశాల, ఐటీ టవర్ తీసుకువచ్చానని, వీటిని తానే పూర్తి చేస్తానన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్ రూ.5 వేలకు పెంచుతామని, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, కల్యాణలక్ష్మి సాయం రూ.2 లక్షలకు పెంచుతామని, రేషన్‌పై సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. అలాగే, మహిళలకు సౌభాగ్యలక్ష్మి కింద రూ.3000 అందిస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు గెలిచేది లేదని, వారికి ఓటు వేసి వృథా చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు జంగిలి సాగర్, తుల రాజేశ్వరి-బాలయ్య, కాశెట్టి లావణ్య-శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, ఆయా డివిజన్ల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ ప్రజలే దైవంగా, నగరాభివృద్ధే లక్ష్యంగా తాను పని చేస్తున్నానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్‌తో కలిసి ప్రచారం చేశారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధిని ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా, తాను నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే కరీంనగర్‌ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తయితే దేశంలోనే కరీంనగర్ గొప్ప నగరంగా నిలుస్తుందన్నారు.
ఈ అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు అవగాహనే లేదని, ఇంకా చిత్తశుద్ధితో ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వచ్చి మోస పూరిత మాటలు చెప్పేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, అన్ని ఆలోచించి ఓటేయాలని కోరారు. అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే బీఆర్ఎస్కు మద్దతివ్వాలని కోరారు. అభివృద్ధి కొనసాగాలంటే కారుగుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బండారి వేణు, భూమాగౌడ్, ట్రస్మా రాష్ట్ర నాయకుడు శేఖర్‌రావు, కర్ర సూర్యశేఖర్, చక్రధర్‌రావు, వెంకటేశ్ పాల్గొన్నారు.
కరీంనగర్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని పలు మసీదుల వద్ద నమాజ్ అనంతరం మంత్రితో పాటు ఎంఐఎం నాయకుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ముస్లింలను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి, తనను నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే కరీంనగర్‌ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తయితే కరీంనగర్ గొప్ప నగరంగా మారుతుందన్నారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అమ్జద్అలీ, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నాయకులు సయ్యద్ మొయిజుద్దీన్ ఖాదీర్ యూసుఫ్, అఖిల్ ఫిరోజ్, అలీ బాబా, అజర్ దబీర్, సాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.