కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న నాలుగు పథకాల అమలుకు బ్రేక్ పడింది. ముందే అరకొరగా ప్రారంభించిన పథకాలు ఇప్పట్లో అందడం కష్టమే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో మరో నెలన్నర వరకు పథకాల ముచ్చటే ఉండదు. ఆ తర్వాత వరుసగా స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇలా మళ్లీ నెలలపాటు కోడ్ అమల్లోకి ఉండవచ్చు. ఇటీవల ప్రతి మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వరుస ఎన్నికల కోడ్ విషయం సర్కారుకు ముందే తెలిసి.. ఇలా ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి చేతులు దులుపుకొంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
– యాదాద్రి భువనగిరి, జనవరి 29 (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం మార్చి 29న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వచ్చే నెల మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగనుంది. తిరిగి మార్చి 8న ఎన్నికల కోడ్ ముగుస్తుంది. అప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా కొత్త పథకాలు, అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేయడానికి వీలులేదు. దాంతో మరో నెలన్నర పాటు కొత్త పథకాల కోసం ఎదురుచూడాల్సిందే. ఆ తర్వాత కూడా పథకాలు అమలు చేస్తారో, లేదోననే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దాంతో మళ్లీ వరుసగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉన్న తక్కువ సమయంలో అమలు చేస్తే తప్ప ఇప్పట్లో పథకాలు అందడం కష్టమనే చెప్పాలి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట సీజన్ ప్రారంభంలో రైతుబంధు డబ్బులు వెంట వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. గతేడాది యాసంగి సీజన్లో ఆలస్యంగా పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5వేల చొప్పున రైతు భరోసా పేరుతో డబ్బులు జమ చేశారు. ఇక రబీ సీజన్లో మొత్తానికే ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించారు. ఇప్పుడు యాసంగి సీజన్లో అనర్హుల ఏరివేత, కమిటీల పేరుతో కాలయాపన చేశారు. ఇప్పటికే రైతులు పెట్టుబడి సాయానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేకమంది మిత్తికి అప్పులు తెచ్చి సాగు పనులు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ మరో నెలన్నరపాటు పంట పెట్టుబడి సాయం ఆలస్యం కానుండడంతో ఈ సీజన్లోనూ రైతులకు కష్టకాలం వచ్చినట్లయ్యింది. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే సుమారు రెండు లక్షల మంది రైతులు రైతుభరోసా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తొలి విడుతల్లో సొంత స్థలం ఉన్న వారికి ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షల సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 మంది అర్హులకు ఇస్తామని పేర్కొంది. జిల్లాలో ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,01,977 దరఖాస్తులు వచ్చాయి. వారిలో అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహించింది. 1.96లక్షల మంది అప్లికేషన్లను పరిశీలించగా, 56,964 మందికి సొంత ఇండ్లు లేవని, 22,397 మందికి సొంత ఇండ్లతోపాటు స్థలాలు కూడా లేవని తేల్చారు. మొత్తంగా 79,361 మందిని అర్హులుగా గుర్తించారు. ప్రభుత్వం ఇటీవల గ్రామ సభలు కూడా నిర్వహించింది. అందులో అర్హుల జాబితాను ప్రకటించింది. కానీ ఈ నెల 26న పథకాలు అందిస్తామని ప్రగల్భాలు పలికినా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 గ్రామాలకు మాత్రమే పరిమితం చేసింది. అసలు ఎవరికి ఇస్తరో.. ఎప్పుడు ఇస్తారో.. స్పష్టత లేదు. అంతేగాక ఇటీవల ఇండ్ల మంజూరు ప్రొసిడింగ్ కాపీలు పొందినోళ్లు కూడా ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోయడానికి బ్రేక్ పడినట్లయ్యిందని అధికారులు చెబుతున్నారు.
రైతుభరోసాతోపాటు వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఏటా కనీసం 20 పని దినాలు చేసిన వారికి సంవత్సరానికి రూ.12వేలు ఇస్తామని ప్రకటించింది. పథకానికి కుటుంబ యూనిట్‌గా తీసుకున్న నేపథ్యంలో 16,927 మందిని ప్రతిపాదించారు. కానీ అర్హుల జాబితా ఎంపిక ప్రక్రియతోనే ఆగిపోయింది. కొత్త రేషన్ కార్డులదీ అదే పరిస్థితి. జిల్లాలో 70,894 మందిని అర్హులుగా గుర్తించారు. ఇక కార్డుల్లో సభ్యులుగా చేరిక కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 43,360 మందిని పరిగణలోకి తీసుకున్నారు.
వాస్తవానికి ప్రభుత్వం జనవరి 26న అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తామని ప్రకటించింది. దరఖాస్తులు, గ్రామ సభల పేరుతో హడావుడి చేసింది. తీరా మండలానికి ఒక్క రెవెన్యూ గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున వారికి మాత్రమే పథకాలను వర్తిపంజేసింది. దాంతో ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న మిగతా లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ వస్తుందని ముందే భావించి.. ఎంపిక చేసిన గ్రామాల్లోనే పథకాలను ప్రారంభించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కోడ్ రావడంతో మరో నెలన్నర పాటు పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉండదనే భావించి ఇలా చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆ తర్వాత స్థానిక సంస్థలు వస్తే మళ్లీ కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఇలా సాధ్యమైన మేరకు కాలయాపన చేయడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది.