
Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 18 : 20 ఏళ్ల క్రితం నాటి ఇంటికి ఇప్పుడు అనుమతులు లేవంటూ రామగుండం నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారులు అన్యాయంగా కూల్చివేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు గోదావరిఖని అశోక్ నగర్ లో గల వాటర్ ఎక్కిన సంఘటన మంగళవారం కలకలం రేపింది. సుమారు మూడున్నర గంటల పాటు ట్యాంక్ పైనే ఉన్న దంపతులు తమకు న్యాయం జరగని పక్షంలో దూకుతామంటూ హెచ్చరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి మున్సిపల్ అధికారులను పిలిపించి హామీ ఇప్పించడంతో బాధితులు శాంతించి దిగడంతో సద్దుమణిగింది. కాగా, బాధితుల కథనం ప్రకారం.. రామగుండం నగర పాలక సంస్థ 22వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ ప్రాంతంకు చెందిన మీనుగు లక్ష్మీ, మొగిలి దంపతులు తమకు వారసత్వంగా వచ్చిన భూమిలో 20 యేళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిని గత రెండు నెలల క్రితం తాము అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్ లో ఉండగా, ఇంట్లో లేని సమయం చూసి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తమ ఇంటిని కూల్చివేశారని వాపోయారు.
ఆ సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లు కూల్చివేసి ఉందనీ, హతాశయులమైన తాము వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే అనుమతి లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. 20 యేళ్ల నుంచి మున్సిపాలిటికి పన్నులు కడుతూనే ఉన్నామనీ, ఇప్పుడు అనుమతి లేదని కూల్చడం సరైంది కాదనీ, తమకు నష్ట పరిహారం చెల్లించాలని గత వారం రోజులుగా మున్సిపల్ ఆఫీసు వద్ద బైఠాయించినా అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎన్ని మార్లు విన్నవించిన పట్టించుకోలేదని వాపోయారు.
అధికారుల ఉదాసీనత వైఖరికి ఓపిక నశించి తమకు న్యాయం జరగదని నిర్ధారించుకొని వాటర్ ట్యాంకు ఎక్కినట్లు తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని ఎలా కూల్చివేస్తారని బాధితురాలి కుమారుడు, కోడలు ట్యాంకు వద్ద అధికారులతో వాగ్వాదంకు దిగారు. కాగా, గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి సంఘటన స్థలంకు చేరుకొని మున్సిపల్ టీపీఎస్ నవీన్ ను పిలిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కుమారుడు ట్యాంక్ పైకి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి కిందకు తీసుకురావడంతో ఆందోళన సద్దుమనగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.