Bhageeratha maharshi | కలెక్టరేట్, మే 04 : సగరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సగరుల కులగురువు భగీరథ మహర్షి జయంతి వేడుకలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశానుసారం భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సగరుల సమస్యలు పరిష్కరించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారికి అందేలా కృషి చేస్తానని అన్నారు.
సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా మాజీ అధ్యక్షుడు ఏరుకొండ ప్రసాద్ సగర, మౌనిక సగర మాట్లాడుతూ, సగర భగీరథ మహర్షి చరిత్రను వివరించారు. మహనీయుని స్మరణలో అందరూ ఉండాలని, ఆయన అడుగుజాడల్లో ప్రతీ ఒక్కరూ నడవాలని కోరారు. సగరులు ఆర్థికంగా, రాజకీయంగా వెనకబాటు తనానికి గురయ్యారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.
సగరుల కృల వృత్తి అయిన గృహాలు నిర్మించడంలో అధిక శాతం పనులు, కాంట్రాక్టర్లుగా సగరులకే అవకాశం కల్పించాలని, రాజీవ్ యువ వికాసంలో సగరులకు ప్రాధాన్యత కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సగరులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. లేబర్ కార్డుల జారీపై అధికారులతో సగరులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ స్పందిస్తూ సమస్యలపై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సగర భగీరథ మహర్షి జయంతిని రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షనీయమన్నారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్కిరణ్, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ అధికారి సంపూర్ణ, అడ్మినిస్ర్టేషన్ అధికారి శ్యాంసుందర్, సగర సంఘం రాష్ర్ట కార్యనిర్వాహణ కార్యదర్శి కానిగంటి శ్రీనివాస్ సగర, నాయకులు కొల్లూరి బుచ్చయ్య, కుర్మిండ్ల మనుసుకేష్, మహిళా నాయకులు కట్ట విజయ, గుంటి భాగ్య, కట్ట రాజమ్మ, కట్ట వసంత, కట్ట సరమ్మ, కట్ట లత, కట్ట ఈశ్వరతో పాటు మహిళలు, అధికారులు తదితరులు పాల్గొని భగీరథ మహర్షికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.