Dharmaram | ధర్మారం,జనవరి 8: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని స్థానిక ఎంపీడీవో వేముల సుమలత అన్నారు. అంతర్గాం మండలంలో పనిచేసి అక్కడి నుంచి ఇటీవల ధర్మారం మండలానికి డిప్యూటేషన్ పై ఆమె వచ్చారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సుమలత మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్, స్థానిక మంత్రి ఆదేశానుసారం మండలాన్ని అభివృద్ధి సమగ్ర అభివృద్ధి చేయడానికి, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.
ఇటీవలే సర్పంచ్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గ్రామాలలో సమస్యల పరిష్కారం గురించి ఇప్పటికే గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేసినట్లు ఆమె వివరించారు. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారం గురించి తీర్మానాలు చేస్తున్నారని ఆ దిశగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. త్వరలో సర్పంచులు, వార్డు సభ్యులకు వేరువేరుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించి వారి విధుల గురించి వివరించడం జరుగుతుందని అందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇప్పటికే తాను కొన్ని గ్రామాలను సందర్శించానని మిగతా గ్రామాలన్నిటిని సందర్శించి సమస్యలు తెలుసుకుంటానని ఎంపీడీవో సుమలత వివరించారు. గ్రామాలలో నెలకొన్న ప్రధాన సమస్యలు ఉంటే ప్రజలు తన దృష్టికి తీసుకువస్తే ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శుల ద్వారా సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. ఇక్కడ ఆమె వెంట స్థానిక మండల పరిషత్ సూపరిండెంట్ శ్రీనివాస్ ఉన్నారు.