MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 25: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి నిధులు రూ.2 లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరుట్లలో ప్రజల సౌకర్యార్థం రూ.12 కోట్లతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సహకారంతో వంద పడకల ఆసుపత్రిని నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన ఆసుపత్రి అభివృద్ధికి సహకరించడం లేదన్నారు. ఆసుపత్రిలో వైద్య పరికరాలు అందుబాటులో లేవని, అవసరమైన స్టాప్ ను నియమించలేదని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రులను పలుమార్లు కలిసి ఆసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించినట్లు తెలిపారు.
ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు శుద్ధమైన జలాన్ని అందించేందుకు ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేశామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాశిరెడ్డి మోహన్ రెడ్డి, అన్వర్, రవీందర్, ఆనంద్, ఆసుపత్రి సూపరిండెంట్ సునీతారాణి, వైద్యులు వినోద్, రమేష్, రామకృష్ణ, ఉదయ మార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.