Veenavanka | వీణవంక, మార్చి 29 : విద్యార్థులు సత్ప్రవర్తనతో పాటు ఉన్నత స్థాయికి చేరడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కృషి అవసరమని ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు. వీణవంక మండలంలోని చల్లూరు ఆల్ఫ్రెడ్ పోబెల్ హైస్కూల్లో జరిగిన ప్రీ గ్రాడ్యుయేషన్ సెరెమనీకి ఆవుల తిరుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల తిరుపతి, ట్రినిటీ విద్యా సంస్థల డైరెక్టర్ జాన్ థామస్, ప్రిన్సిపాల్ మనోజ్‌కుమార్, ప్రజాప్రతినిధులు జ్యోతిప్రజ్వళన చేసి, చిన్నారులకు గ్యాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.
అనంతరం ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులను చెడువ్యసనాలకు దూరంగా ఉంచాలని, సెల్ఫోన్లు, టీవీలకు బానిసలు కాకుండా చూసుకోవాలని అన్నారు. గంజాయి, డ్రగ్సవంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా చూసుకోవాలని, 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే బైకులు ఇవ్వాలని, రేయింబవళ్లు తిరగకుండా చూసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్‌కు పాఠశాల పునాదివంటిదని, విద్యతో పాటు సన్మార్గాలు కూడా నేర్పించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంపత్ రెడ్డి, ఉపసర్పంచ్ ఫసియొద్దీన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.