డార్విన్: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించేందుకు బంగ్లాదేశ్ చేరువైంది. ఓవర్‌నైట్ స్కోరు 351/6తో మూడో రోజు, శనివారం ఆట కొనసాగించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగుల వద్ద ఆలౌటై ఏకంగా 228 రన్స్ ఆధిక్యం అందుకుంది. ఓవర్‌నైట్ బ్యాటర్ తంజిద్ (101) అదే స్కోరు వద్ద ఔటైనా… టెయిలెండర్లతో కలిసి మెహదీ హసన్ మిరాజ్ (65) జట్టుకు విలువైన రన్స్ అందించాడు. ఆతిథ్య పేసర్ హేజిల్‌వుడ్ (6/89) ఆరు వికెట్లు పడగొట్టి తన కెరీర్లో 300 వికెట్ల క్లబ్లో చేరాడు. అనంతరం భారీ లోటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన ఆసీస్ మూడో రోజు చివరకు 53 ఓవర్లలో 161/4తో ఓటమి దిశగా పయనిస్తోంది. పేసర్ హసన్ మహ్మూద్ (2/33).. ఓపెనర్లు వెదరాల్డ్ (0), ట్రావిస్ హెడ్ (17)ను ఔట్ చేయడంతో హోమ్ టీమ్ 37/2తో కష్టాల్లో పడింది. లబుషేన్ (31) కాసేపు క్రీజులో నిలిచినా.. తైజుల్ ఇస్లాం (1/28) స్ట్రెయిట్ బాల్‌ను అంచనా వేయలేక బౌల్డయ్యాడు. నిలకడగా పరుగులు చేస్తున్న స్టీవ్ స్మిత్ (44)ను మిరాజ్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం కామెరాన్ గ్రీన్ (43 బ్యాటింగ్), అలెక్స్ కేరీ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌లో ఇంకా 67 రన్స్ వెనుకంజలోనే ఉన్న ఆసీస్ ఓటమి తప్పించుకోవాలంటే నాలుగో రోజు అద్భుతంగా బ్యాటింగ్ చేయాల్సిందే.