తెలుగు సంవత్సరాది ఉగాదికి.. ఆమని వస్తుంది. మావి చిగురిస్తుంది. కోయిల పాడుతుంది. ప్రకృతి పరవశిస్తుంది. అదే మలయాళీల కొత్త సంవత్సరం ఓనమ్ వచ్చిందంటే.. వర్షాలతో కేరళం మురిసిపోతుంటుంది. నదులు ఉప్పొంగుతుంటాయి. సరస్సులు నిండుకుండలు అవుతాయి. కాలువలు పారుతుంటాయి. నదుల పాయల్లో.. కాలువల మలుపుల్లో.. సరస్సుల్లో.. ముచ్చటగా ముస్తాబైన పడవలు పరుగులు తీస్తుంటాయి. పోటాపోటీగా దూసుకెళ్తుంటాయి. తమదైన సంస్కృతిని చాటి చెబుతుంటాయి. ఓనం పండుగ వేళ.. కేరళంలో బోట్ రేసులు జోరుగా సాగుతుంటాయి.
రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఈ పడవ పందేలు సాగినా.. అలెప్పీలో జరిగే నెహ్రూ బోట్ ట్రోఫి బోట్ రేస్ మరింత ప్రత్యేకం. ఎప్పుడెప్పుడు ఆగస్టులో వస్తుందా అని ఏడాదంతా ఎదురు చూస్తుంటారు అలెప్పీవాసులు. వాళ్లు మాత్రమే కాదు.. పడవ పందేలంటే ఆసక్తి ఉన్నవాళ్లంతా రేసు జరిగే రోజు గురించి నెలల ముందే వాకబు చేస్తారు. ముందస్తుగానే టికెట్లు గట్రా బుక్ చేసుకొని అలెప్పీ బాటపడతారు. పోటీ జరిగే పున్నామడ సరస్సు ఒడ్డుకు తండోపతండాలుగా చేరుకుంటారు. ఈలలు, కేరింతలతో పోటీలో పాల్గొన్నంత ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఈసారి ఆగస్టు 22న జరగనున్న పోటీ రోజూ ఇదే సందడి అక్కడ నెలకొంటుంది.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1952లో ఇక్కడికి వచ్చారు. పడవ పందేలు చూసి ముచ్చటపడ్డారు. రేసులో గెలిచిన పడవలోకి ఎక్కి మరీ.. నావికులను అభినందించారట! ఆయన గౌరవార్థం 1969లో ఈ బోట్ రేస్‌కు నెహ్రూ ట్రోఫీగా నామకరణం చేశారు నిర్వాహకులు. కేరళంలో జరిగే అతిపెద్ద పడవ పోటీలివి! ఇందులో పాల్గొనడాన్ని ఒక గౌరవంగా భావిస్తారు. జులై మాసం రావడంతోనే పలు గ్రామాల్లోని యువకులు పందేనికి సై అంటారు. కొత్తగా పడవలను తయారు చేస్తారు. ఆహార నియమాలు, కఠోర వ్యాయమాలు చేసి శారీరకంగా సన్నద్ధం అవుతారు. బ్యాక్‌వాటర్స్ కాలువల్లో తమ వేగాన్ని పరీక్షించుకుంటారు.
అసలు పోటీల్లో తమ వారి విన్యాసాలను చూసేందుకు ఆయా గ్రామాల ప్రజలంతా చలో అలెప్పీ అంటారు. తమవారు విజయం దిశగా సాగేలా ప్రోత్సహిస్తారు. ఇలా పదుల సంఖ్యలో పడవలు సరస్సులో పోటీకి దిగుతాయి. ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలివస్తారు. సరస్సులో పెద్ద పెద్ద బోట్లపై విహరిస్తూ.. పోటీలను దగ్గరగా తిలకిస్తారు. వాద్యాల హోరుకు తగ్గట్టుగా పడవను నడుపుతున్న నావికుల విన్యాసాలను చూసి ఆశ్చర్యపోతారు. ఒకట్రెండు రోజులు అలెప్పీలో ఉండి చుట్టుపక్కల ఉన్న పర్యాటక కేంద్రాలను వీక్షించి తిరుగు ప్రయాణమవుతారు. ఎందుకు ఆలస్యం మీరూ చలో అలెప్పీ అనేయండి!!