అడిగిందల్లా కావాలని పట్టుబట్టే లక్షణం నాకు లేదు. ఎలా అలవాటయిందో గానీ, మొదటి నుంచీ ప్రతిదీ అవతలివాళ్ల కోణం లోంచి ఆలోచించడం అలవాటు. చిన్నప్పట్నుంచీ తిండి, దుస్తులు, పుస్తకాలు, బొమ్మలు, ఇతర వస్తువులు… ఇలా ఏవైనా నాన్నో, అమ్మో ఇవ్వడమో, కొనివ్వడమో జరిగితే మారు మాట్లాడకుండా తీసుకునేదాన్ని. ఎప్పుడైనా నాకు నచ్చకపోతే ‘ఇది బాగలేదు’ అనగానే ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను ఒప్పించే ప్రయత్నం చేసేవారు.
‘నువ్వు మంచిదానివి గద బిడ్డా! ఈ రంగు గౌను నీకెంత బాగుంటది ఎరికేనా? ఇది తొడుక్కున్నాక నీదే బాగున్నదని అందరు అంటరు. నీ ఒంటి మీద ఇది ఎంత మంచిగున్నది చూడు! మళ్లోసారికి కొన్నప్పుడు అక్క గౌను కలర్‌ది నీకు కొందాం. మా రాముడు ( నేనే! ) మంచిది, చెప్పినట్టు ఇంటది. సరేనా!’ అనగానే డూడూ బసవన్నలా తలూపి సంతోషంగా అంగీకరించేదాన్ని. ఆ తర్వాతెప్పుడో వచ్చే దసరా.. అప్పుడే వచ్చినట్టూ, నాకు నచ్చిన రంగుది నేను ధరించి అందరూ చూస్తుండగా తిరిగినట్టూ ఎంతో ముందుగానే ఊహించుకుని ఆనందించేదాన్ని. ఇట్లా ఎంత కన్విన్స్ అయ్యేదాన్నంటే మొదటగా నాకు వచ్చిన నచ్చని వస్తువుపైన కొంచెం కూడా అయిష్టత లేనంత. అలా నన్ను దేనికైనా ఒప్పించడం, లేదా ఏ పనికైనా అంగీకరింపజేయడం అవతలివాళ్లకు ఎంతో తేలిక.
నోట్ బుక్స్ కొనుక్కున్నప్పుడు వాటి మీద అందమైన సీనరీలు ముద్రించి ఉండేవి. ఒకేలాంటి బొమ్మలున్న వాటిని అక్కా, నేనూ ఇద్దరమూ పంచుకున్నాక మిగిలినవాటిలో నాకు నచ్చిన బొమ్మలుండే బుక్స్ నాకు వచ్చే అవకాశం తక్కువ. అక్క కొన్నిటికి రాజీ పడేది కాదు. అంతమాత్రం చేత తనేమీ నాకు ఉండొద్దనేది కూడా కాదు. మాకు చాలామటుకు ఏవి కొన్నా ఏ మాత్రం తేడా లేకుండానే ఒకేలాంటివి కొనేవారు. కొన్నాళ్లకు దుస్తుల విషయంలో మేమే మరీ బ్యాండు మేళం లాగానో ‘ముగ్గురు మూర్ఖులు’ సినిమాలోలానో ఎందుకని ఒకే లాంటివి, రంగులు మాత్రం వేరేగా చూసి ఎన్నుకునేవాళ్లం. ఇక ఇప్పుడయితే ‘నీకు నచ్చింది నువ్వే మొదట తీసుకో!‘ అంటే… ‘లేదు..లేదు..’ నువ్వు ఏరుకున్నాకే మిగిలింది నేను తీసుకుంటా!’ అని ఒకర్నొకరు అనుకునేదాకా వచ్చింది. ఎంతయినా అనుభవం మనుషుల్ని మారుస్తుందిగా!
అయితే అదేదో సినిమాలో హీరోయిన్ జుట్టంతా విరబోసుకుని కిటికీ ఊచలు పట్టుకుని బయటికి చూస్తూ ‘గతం నన్ను వెంటాడుతోంది చినబాబూ!’ అన్నట్టు ఈ సర్దుకుపోవడం అనేది జీవితమంతా నన్ను వెంటాడుతూనే వచ్చింది. మా కజిన్స్‌తో గానీ, స్నేహితులతో గానీ, నా కొలీగ్స్‌తో గానీ ఎప్పుడైనా షాపింగ్‌కి వెళ్లామనుకోండి… అందులో కొందరు (అందరూ కాదు) ఆ షాపతను చీరలు తీసి చూపిస్తూ ఉండగానే ఒకటి దగ్గరికి లాక్కుని ఒళ్లో పెట్టేసుకునేవారు. నాకూ అదే చీర నచ్చేది. కానీ, ఆ తీసుకున్నామె ఆ చీరనేదో మొట్టమొదటే మగ్గం దగ్గరే ఆర్డర్ ఇచ్చి నేయించుకున్నట్టో లేక కంపెనీకి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నట్టో సొంతం చేసుకుని వదిలేది కాదు. నేను మనసు పడ్డ చీర నన్ను అవతలి వాళ్ల ఒడిలోంచి ఊరిస్తూ ఉండేది. ఈలోగా ఎవరికి కావలసినవి వాళ్లు సెలెక్ట్ చేసుకున్నాక నేను మిగిలేదాన్ని. ‘చివరికి మిగిలేది’ అన్నట్టు నాకు అందరూ ఎంచుకోగా మిగిలినదేదో నా వైపు దీనంగా చూస్తూ ఉండేది.
‘అయ్యో! నువ్వేం సెలెక్ట్ చేసుకోలేదా రమా! అదేంటీ, నువ్వు కూడా ఏదో ఒకటి తీసుకో!’ అంటూ అందరూ టన్నుల కొద్దీ సానుభూతి చూపించి నేను ఏదో ఒకటి కొనుక్కునేలా పురికొల్పేవారు. అదే మొదటే నేను ఏదైనా నచ్చి ఆ దొంతరల్లోంచి తీశాననుకోండి, ఎవరో ఒకరు ‘అబ్బ! భలే ఉందిది, రంగూ, కొంగూ, అంచూ! నేను ఎన్నాళ్లనుంచో ఇట్లాంటిదే కొనాలనుకున్నాను. సరిగ్గా తీశావు’ అంటూ నా చేతుల్లోంచి తీసుకునేవారు. వాళ్లకు నచ్చింది ఏరినందుకు మురిసి ముక్కలై ‘వెర్రిదానా! మరి నీ సంగతేంటి? ఎప్పటికీ ఇట్లాగే ‘త్యాగాల రేవులో రాగాల పడవ’లా వుండిపోతావా?’ అంటూ హెచ్చరిస్తున్న మనసును ‘హుష్! ఊరుకో! నీకేం తెలుసు?’ అంటూ మందలించేదాన్ని. నేను అప్పుడప్పుడూ ‘కొన్నాళ్లపాటు అస్సలు దుస్తులు కొనకూడదు’ అనే గట్టి నిర్ణయం తీసుకునేదాన్ని. మామూలప్పుడు ఏమీ కాకపోయినా, అదేమిటో అలా ప్రతిజ్ఞ చేసినప్పుడు రెండు రోజులైనా కాకమునుపే ప్రతిజ్ఞా భంగం జరిగే పరిస్థితులు ఏర్పడేవి.
అదెలాగంటే… నా ఖర్మకాలి మా స్నేహితుల్లో ఎవరిదో పుట్టినరోజో, పెళ్లిరోజో, మరొకటో అప్పుడే వచ్చేది. ‘రమా! చీర కొనుక్కోవాలోయ్, నీ సెలక్షన్ బాగుంటుంది (మనం ఫ్లాట్), వెళ్దామా?’ అని అడిగేవారు. ఏం చేస్తాం? తక్షణ కర్తవ్యం అదే కదా! అలా వెళ్లి.. మొదట అడిగినావిడకు సెలెక్ట్ చేసి, షాపువాడు, తీసుకెళ్లినావిడ, ఇద్దరి కోరిక మీద నేనూ కొనుక్కునేదాన్ని. చాలాసార్లు నేనేమీ కొనాల్సిన అవసరం లేకపోయినా, చివరకు మిగిలిందే నాకు దక్కేది. ఈ ‘మంచి’ అనే పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. దానికోసం చిన్నవీ, పెద్దవీ ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నిజానికి పేరు కోసం వచ్చే మంచి అవసరం లేదు కూడా. అయితే, ఈ విషయం ఎంతో జీవితం గడిచాక, ఎన్నో కోల్పోయాక గానీ తెలిసిరాదు. అప్పటికి ఎన్నో పోగొట్టుకుంటాం. మంచిది అనే బ్రాండ్ ఒకసారి పడిందో… ఇక జీవితాంతం దాన్ని నిలబెట్టుకోవడానికి నానా చావూ చావాల్సిందే! ఇలా చాలా సందర్భాలున్నాయి గానీ, మరోసారి!
-నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి