Education Trust Festival | గంగాధర, జూలై 4 : గంగాధర మండలంలోని కొండాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది 21 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 73 మందికి చేరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ‘విద్యా విశ్వోత్సవం– ప్రతి అడుగు చదువు వైపు’ అనే థీమ్‌తో శుక్రవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గ్రామ వీధుల గుండా ర్యాలీని నిర్వహించి విద్యా ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు మాట్లాడుతూ కొండాయపల్లి గ్రామ ప్రజల చైతన్యం, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల భాగస్వామ్యమే అనూహ్యమైన విద్యా పురోగతికి కారణమని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో విద్యాభివృద్ధికి ఇది ఒక చిరస్మరణీయ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. గంగాధర మండలంలోని అన్ని గ్రామాలకు కొండయ్యపల్లి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని, సమిష్టిగా విద్యాభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును మనం గమనించవచ్చన్నారు. ఇది నేరుగా విద్యార్థుల భవిష్యత్తుపై పెట్టిన ఆశలతో కూడిన విజయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినయ్ సాగర్ మల్యాల, మర్రి శ్రీధర్, గౌడ సాయి, బండపల్లి విజయ్, లక్ష్మణ్ ఎర్రం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.