Dharmaram | ధర్మారం, జనవరి 2 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పలు గ్రామాలలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను విద్యాశాఖ అధికారులు బడిలో చేర్పించారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ధర్మారం ఎంఈవో పీ ప్రభాకర్, ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ షీలా రెడ్డి, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ మల్లారెడ్డి, సీఆర్పీ కవిత ఆధ్వర్యంలో ధర్మారం, బొమ్మరెడ్డిపల్లి గ్రామ శివారులలో ఇటుక బట్టీలను వారు తనిఖీ చేశారు.
ఉపాధి కోసం వచ్చిన ఒరిస్సా కార్మికుల పిల్లలను 15 మందిని గుర్తించి జెడ్పి, ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికుల పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ బడికి వెళ్లకుండా ఉంటే ఇటుక బట్టి యజమానులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఉన్న ఇటుక బట్టీల యజమానులంతా కార్మికుల పిల్లలను బడిలో చేర్పించి వారు విద్యను అభ్యసించే విధంగా సహకరించాలని ఆయన సూచించారు.