కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు విజయ
PEDDAPALLY | రామగిరి, మార్చి 26: ఉద్యానవన పంటల సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు విజయ సూచించారు. మండలంలోని రామగిరిఖిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో 13వ శాస్త్రీయ సలహా మండలి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రంలోని పండ్లతోటలు, కూరగాయల క్షేత్రాలను రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి ఆమె సందర్శించారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అండ్ హెడ్ డాక్టర్ ఏ శ్రీనివాస్ శాస్త్రవేత్తల బృందం గత సంవత్సరం చేపట్టిన కార్యక్రమాలు, రానున్న సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలను పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ వ్యవసాయ పంటల సాగుతో పోల్చుకుంటే ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయలు, పూలు సాగు చేయటం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుందని, రైతులు ఆ దిశగా ఆలోచన చేసి ఉద్యాన పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ పంటలు సాగు చేసేందుకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యాన విశ్వవిద్యాలయం అందిస్తుందని తెలిపారు. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ డీ రాజిరెడ్డి మాట్లాడుతూ పలు గ్రామాలను ఎంపిక చేసుకొని మన ఊరు-మన కూరగాయలు అనే కార్యక్రమంలో భాగంగా ఉత్పత్తి చేసిన కూరగాయలు ఆ గ్రామంతో పాటు ఇతర జిల్లాలకు సరఫరా చేసే విధంగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీధర్ సిద్ధి, డాక్టర్ ఉషారాణి, వ్యవసాయ సంయుక్త సంచాలకులు అంజనీ దేవి, నాబార్డ్ ఏజీఎం జై ప్రకాశ్, పీడీడీఆర్డీఏ కలిందిని, జిల్లా పశుపోషణ అధికారి డాక్టర్ శంకర్, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వేణు, వ్యవసాయ అధికారులు శ్రీకాంత్, రామకృష్ణ, ఉద్యాన అధికారి జ్యోతి, స్వచ్ఛంద సంస్థలు, చారి, షార్ప్, వెలుగు రేఖ జీవీఆర్డీఎస్(ఎన్జీఓ) సంపత్, చైర్మన్లు, డైరెక్టర్లు, శాస్త్రీయ సలహా మండలి నామినేటెడ్ రైతు ప్రతినిధులు రాంబట్ల సంతోషిని, (పూర్వ వ్యవసాయ మార్కెట్ చైర్మన్), జాతీయ రైతు అవార్డు గ్రహీతలు ఎర్రం మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.