వేములవాడ/ సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 4: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బుధవారం భూకంప కలకలం రేగింది. ఉదయం 7.27 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు బెంబేలెత్తారు. ఇండ్లల్లో సామగ్రి కింద పడి శబ్దాలు రావడంతో ఏం జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. మొదట ఎవరికి వారు తమ ఇంట్లోనే ఇలా జరిగిందేమోనని భావించినా.. చుట్టు పక్కల వారు సైతం ఇదే విధంగా బయటికి రావడంతో చూసి భూకంపం వచ్చినట్టు గుర్తించారు.
సింగరేణి ప్రాంతంలో ఓసీపీల్లో బొగ్గు నిల్వల తవ్వకాల కోసం చేపట్టే జిలెటిన్ స్టిక్స్ బ్లాస్టింగ్గా భావించారు. కానీ కొద్ది సేపటి ద్వారా టీవీ న్యూస్ చానళ్లు, సోషల్ మీడియాల ద్వారా పక్క గ్రామాలు, పక్క జిల్లాల్లో సైతం భూమి కంపించిందని తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ భూకంపం దృశ్యాలు పలుచోట్ల సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, వాటిని చూసి భయాందోళన వ్యక్తం చేశారు. అయితే పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ తోట నారాయణకు చెందిన ఇంటి ప్రహరీ కూలిపోయింది. ఆ సమయంలో అకడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.