కరీంనగర్ కలెక్టరేట్, జూలై 19: ఎల్‌నినో నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నీటి ఇబ్బందులు రాకుండా చూడాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యేకు రూ.కోటి నిధులను డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి కేటాయించాలని, ఈ నిధులు తాగునీటికి మాత్రమే వినియోగించేలా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని కోరారు. ఎల్‌నినో నేపథ్యంలో అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు గాను ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా అధికారులతో కలిసి వ్యవసాయశాఖ మంత్రి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే గంగుల ప్రస్తావించారు. ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయని, రైతులను ఆదుకునేందుకు పంటల బీమా సౌకర్యం కల్పించాలని, ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూగర్భ జలాలు అడుగుంటుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేసేలా చర్యలు చేపట్టాలని, తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
సబ్సిడీపై విత్తనాలు అందించడంతోపాటు తక్కువ నీటితో సాగుకు ఉపయోగపడే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని అమలు చేస్తే రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారిస్తారని చెప్పారు. వర్షాభావ పరిస్థితులతో వైరల్ ఫీవర్లు పెరిగే ప్రమాదముందని, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, దవాఖానల్లో మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు తాగునీరు, ఆరోగ్యం, రైతులకు సాగు భరోసా అందించడమే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా భావిస్తే ఎల్‌నినోను ఎదుర్కోవచ్చని చెప్పారు.
కన్నెపల్లి మోటర్లు ఆన్ చేయాలి
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిపట్టు వీడాలని, కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లు ఆన్ చేసి వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. వరదకాలువ, కాకతీయ కెనాల్లో నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పలు సూచనలు చేశారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయని, మున్ముందు సాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి విడుదలలో జాప్యం జరిగితే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థ్దవంతంగా వినియోగిస్తూ, సాగు ప్రాంతాలకు నీరు చేరేలా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని సూచించారు.