సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఐటీహబ్‌గా ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో దూసుకుపోతున్న భాగ్యనగరం ట్రాఫిక్ జామ్ నగరంగా మారుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ట్రాఫిక్ పోకడలను విశ్లేషించే ప్రసిద్ధ సంస్థ టామ్‌టామ్ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ట్రాఫిక్ ఇండెక్స్ నివేదికలో హైదరాబాద్ ట్రాఫిక్ దారుణమైన పరిస్థితి బయటపడింది. దేశంలోనే అతి నెమ్మదైన ట్రాఫిక్ కలిగిన నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచి ఆందోళన కలిగిస్తున్నది. ఒకప్పుడు బెంగళూరు ట్రాఫిక్ కష్టాలను చూసి నవ్వుకున్న హైదరాబాదీలు.. ప్రస్తుతం తాము కూడా అదే బాటలో పయనిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో అత్యంత దారుణమైన ట్రాఫిక్ ఉన్న నగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో కోల్‌కతా, పుణె, హైదరాబాద్‌లు ఉన్నాయి.
టామ్‌టామ్ నివేదిక ప్రకారం టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ సర్వే తాజా నివేదిక ప్రకారం హైదరాబాదీలు సగటున ఏడాదికి 123 గంటలు ట్రాఫిక్‌లో కోల్పోతున్నారని తేలింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ స్థాయి 55.5 శాతంగా ఉండగా, 10కి.మీ ప్రయాణించడానికి సగటున 32.7 నిమిషాలు పడుతున్నదని, సాయంత్రం, పీక్ అవర్స్‌లో ఇంతే దూరం వెళ్లడానికి సగటున 39.5 నిమిషాలు పడుతున్నదని చెప్పింది. నగరంలో వాహనాల సగటు వేగం గంటకు 23 కిలోమీటర్లకే పరిమితమైంది. ఇది సాధారణ రోజుల లెక్క మాత్రమే కాగా వర్షం పడినా, సాయంత్రాలు, ఆఫీసు సమయాల వంటి పీక్అవర్స్లో ఈ వేగం గంటకు 5 నుంచి 10 కిలోమీటర్లకు పడిపోతుంది. అంటే నడుచుకుంటూ వెళ్లే వేగంతో వాహనాలు కదులుతున్నాయని ట్రాఫిక్ రంగ నిపుణులు చెప్పారు. ట్రాఫిక్ జామ్‌ల వల్ల కేవలం ఇంధనం మాత్రమే కాదు, నగరవాసుల అమూల్యమైన సమయం కూడా రోడ్లపైనే కరిగిపోతున్నది. రద్దీ వల్ల హైదరాబాదీలు ఏడాదికి సగటున 123 గంటలు కోల్పోతున్నారని నివేదిక తేల్చింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ అయిన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్పల్లి, అమీర్‌పేట వంటి ప్రాంతాల్లో సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ప్రత్యక్ష నరకం కనిపిస్తున్నది.
పెరుగుతున్న ట్రాఫిక్, రాత్రి సమయంలో పెరిగిన ఉష్ణోగ్రతలతో నిద్రలేమి కారణంగా, హైదరాబాదీలు ఏడాదిలో దాదాపు 198 గంటలు కోల్పోతున్నారని రెండు వేర్వేరు సంస్థలు (టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్-123 గంటలు, ైక్లెమేట్ సెంట్రల్-75 గంటలు) చేసిన అధ్యయనాలు వెల్లడించాయి. వాతావరణ మార్పులు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం నగరవాసుల జీవనశైలిపై ప్రభావం చూపిస్తున్నదని అమెరికాకు చెందిన ైక్లెమేట్ సెంట్రల్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 1330 నగరాలపై విశ్లేషణ జరిపింది. దక్షిణ భారతంలోని పలు నగరాల్లో వాతావరణ మార్పులు, రాత్రి సమయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నిద్ర సమయం తగ్గిపోతున్నదని విశ్లేషించింది. కాంక్రీట్ జంగల్‌గా మారిన నగరాల్లో కాంక్రీట్, రోడ్లు పగటి సమయంలో ఉష్ణోగ్రతలు గ్రహించి, రాత్రి సమయంలో విడుదల చేయడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దీంతో ఆయా నగరాల్లోని ప్రజలు ఏడాదికి 70 నుంచి 90 గంటల నిద్రను కోల్పోతున్నారని తెలిపింది. హైదరాబాదీలు సగటున 75 గంటల నిద్రను కోల్పోతున్నారని ైక్లెమేట్ సెంట్రల్ నివేదిక తెలిపింది.
హైదరాబాద్ నగర భౌగోళిక పరిస్థితులను గమనిస్తే పాతబస్తీలో ఒక రకమైన సమస్య ఉంటే, హైటెక్ సిటీ వైపు మరో రకమైన సవాలు కనిపిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ వంటి ఐటీహబ్‌లో రోడ్లు వెడల్పుగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ ఊబి తప్పడం లేదు. కొండాపూర్ సిటీమాల్ జంక్షన్, మైండ్‌స్పేస్, ఐఐఐటీ జంక్షన్ల వద్ద ప్రతీరోజూ సాయంత్రం వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. దీనికితోడు ఏ మాత్రం వర్షం పడినా డ్రైనేజీలు పొంగిపొర్లి ఐటీ కారిడార్ మొత్తం గంటల తరబడి గ్రిడ్‌లాక్‌గా మారుతోంది. ఇక పాతబస్తీలో ఇరుకురోడ్లు, ఆక్రమణలు కారణంగా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. చార్మినార్, మదీనామార్కెట్, బహదూర్‌పురా పరిసరాల్లో సమస్య పూర్తిగా వేరు. ఇక్కడ సరైన ఫుట్‌పాత్‌లు లేకపోవడం వల్ల పాదచారులు రోడ్లపైనే నడవాల్సి వస్తోంది. నగరంలో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినప్పటికీ ట్రాఫిక్ ఎందుకు తగ్గడం లేదనే దానికి టామ్‌టామ్ నివేదిక స్పష్టమైన కారణాలను చూపించింది. భాగ్యనగరంలో ప్రస్తుతం వాహనాల సంఖ్య 80లక్షలు దాటిపోగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. మెట్రో, ఆర్టీసీ బస్సుల వంటి ప్రజారవాణా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు సొంత లేదా అద్దె కార్లు, బైకులను వాడుతున్నారు. ఒంటరిగా కార్లలో ప్రయాణించేవారి వల్ల రోడ్లు త్వరగా నిండుతున్నాయి. పుట్‌పాత్‌ల ఆక్రమణ, రోడ్లపైనే పార్కింగ్ చేయడం వల్ల రహదారుల వెడల్పు తగ్గిపోతున్నది.