ఉదయం లేవగానే చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా? రోజంతా ఏదో తెలియని అలసట, మైండ్‌బ్లాంక్ అయినట్లు అనిపిస్తున్నదా? అయితే మీ ఆహార అలవాట్లను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నమాట. మనం తినే తిండి కేవలం కడుపు నింపడానికే కాదు, మన ఆలోచనా శక్తిని, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలోనూ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. సరైన పోషకాలున్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మెదడును వేగంగా, పదునుగా ఉంచేందుకు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 5 అద్భుతమైన ఆహార పదార్థాలపై ఓ లుక్కేద్దాం.
వాల్ నట్స్: చూడటానికి మానవ మెదడు ఆకారంలోనే ఉండే వాల్ నట్స్, మెదడు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు న్యూరాన్లను ఆక్సిడేటివ్ ఒత్తిడి, వాపుల నుంచి కాపాడతాయి. రోజూ నాలుగైదు వాల్ నట్స్ తింటే జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా, కొత్త విషయాలను వేగంగా గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది.
గుడ్లు: గుడ్లలో కేవలం ప్రొటీన్ మాత్రమే కాకుండా ‘కోలిన్’ అనే అత్యంత ముఖ్యమైన పోషకం ఉంటుంది. మన జ్ఞాపకశక్తి, అభ్యాస ప్రక్రియ, కణాల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగపడే ఎసిటైలోలిన్ అనే రసాయన ఉత్పత్తికి కోలిన్ ఎంతగానో దోహదపడుతుంది. రోజూ గుడ్డు తినడం వల్ల నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
ఫ్యాటీ ఫిష్: సాల్మన్, మాకెరెల్ వంటి ఫ్యాటీ ఫిష్‌లలో డీహెచ్ఏ, ఈపీఏ రూపంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు దండిగా ఉంటాయి. మన మెదడులోని సెల్ మెంబ్రేన్లు తయారవ్వడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. న్యూరాన్లు సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి ఈ కొవ్వు ఆమ్లాలు ఎంతగానో సాయపడతాయి. మాంసాహారం తినే వారికి మేలైన పవర్ బూస్టర్‌లా పనిచేస్తాయి.
గుమ్మడి గింజలు : గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు పుషలంగా ఉన్నాయి. వీటిలో జింక్ నరాల సంకేతాలను బలోపేతం చేస్తే, మెగ్నీషియం మెదడు ప్రశాంతతకు, మానసిక పనితీరు మెరుగుపడటానికి తోడ్పడుతుంది. అలాగే ఇందులోని ఐరన్ మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
బెర్రీలు : స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి పళ్లలో ఉండే పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్స్ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి మెదడులోని పాత కణాల స్థానంలో కొత్త అనుబంధాలు ఏర్పడటానికి సాయపడతాయి. తద్వారా తక్షణ ఏకాగ్రత పెరగడమే కాకుండా, వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు ముప్పు తగ్గుతుంది.