‘మనం అంకితభావంతో కష్టపడి పనిచేస్తుంటే మన చుట్టూ గెలవాలని కోరుకునే వారు పెరిగినట్లే..ఓడిపోతే చూద్దామనుకునే వాళ్లు కూడా పెరిగిపోతారు. ఓడిపోతే చూద్దామనుకునే వాళ్లను ఓడించడానికి నేను ఎప్పుడూ ప్రయత్నించను. కానీ..నేను గెలుస్తానని నమ్మేవాళ్లను గెలిపించడానికి కష్టపడుతూనే ఉంటా’ అన్నారు నాని. ఆయన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కయాదులోహర్ కథానాయిక.
సోమవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఇంకా ఆయన చెబుతూ ‘అభిమానులు నాకు వందేళ్లకు సరిపడా ప్రేమనిచ్చారు. ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. 23వ తేది రాత్రి నుంచే థియేటర్లు మొత్తం ఊగిపోతాయి’ అన్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ ..బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్ అనే నమ్మకం ఉందని, ఈ సినిమాకు అద్భుతమైన టీమ్ కుదిరిందన్నారు. తన హృదయానికి దగ్గరైన చిత్రమిదని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపంలో తనకు ఓ సోదరుడు దొరికాడని, ఎక్కడకు వెళ్లినా ప్యారడైజ్ పాటలే వినిపిస్తున్నాయని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వీడియో సందేశంలో ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘువపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రం డిసెంబర్ 3న రావాల్సి ఉంది. అయితే ఈ చిత్ర రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ‘ది ప్యారడైజ్’ ప్రీరిలీజ్ వేడుకలో నిర్మాత వై.రవిశంకర్ తెలిపారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన అన్నారు.