.ముకరంపుర, ఆగస్టు 4 : ఎన్పీడీసీఎల్ వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విసృ్తతంగా వినియోగిస్తున్నది. తాజాగా, విద్యుత్ శాఖ చేపట్టే పనులకు అవసరమైన మెటీరియల్‌ను వెంటనే జారీచేసేలా ఈ-స్టోర్ విధానాన్ని అమలు చేస్తున్నది. దీంతో ఇప్పటి వరకు ఉన్న పేపర్ విధానానికి స్వస్తి పలికి.. ప్రతి లావాదేవీని ఆన్లైన్లో నిర్వహిస్తూ వేగవంతమైన సేవలు అందించేందుకు ముందుకు సాగుతోంది.
ఈ-స్టోర్ పనితీరిలా
విద్యుత్ శాఖ వినియోగదారులకు గృహ, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక కనెక్షన్లు ఇవ్వడంతోపాటు ఇతర పనులు చేపడుతూ ఉంటుంది. అయితే, ఈ పనులకు అవసరమైన మెటీరియల్ జిల్లా స్టోర్ నుంచి జారీ చేస్తారు. ఇది వరకు ఈ ప్రక్రియ అంతా పేపర్ రూపంలో నిర్వహించి, సంబంధిత అధికారుల పరిశీలన, ఆమోదం కోసం ఫైళ్లను పంపించాల్సి వచ్చేది. పాత పద్ధతిలో కొంత జాప్యం జరిగేది. కాగా, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ-స్టోర్ విధానంతో తిప్పలన్నీ తప్పనున్నాయి.
కొత్త పద్ధతిలో సంబంధిత సెక్షన్ ఏఈ ప్రతిపాదిత పనికి కావాల్సిన మెటీరియల్ స్టాక్‌ను స్టోర్‌లో అందుబాటులో ఉందో లేదో సాప్(SAP) సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్లైన్లోనే పరిశీలించి, అవసరమైన మెటీరియల్‌ను రిజర్వు చేస్తారు. రిజర్వు చేసుకున్న మెటీరియల్ సమాచారం ఎస్ఏపీ వర్ ఫ్లో ద్వారా సంబంధిత ఏడీఈ స్టోర్‌కు ఆన్లైన్లో వెళ్తుంది. పనులకు అవసరమైన మెటీరియల్ తీసుకొనే అధికారి మెటీరియల్ తీసుకోవడానికి ఏ రోజు స్టోర్‌కు రావాలో ఆ తేదీ, సమయాన్ని ఎస్ఎంఎస్, ఎస్ఏపీ మెయిల్ రూపంలో సమాచారం వెళ్తుంది. నిర్ణీత సమయానికి సంబంధిత అధికారి స్టోర్‌కు వెళ్లి మెటీరియల్ తీసుకొని పనులు ప్రారంభించాల్సి ఉంటుంది.
పేపర్ లెస్తో సమయం ఆదా
కొత్త విధానంలో అంతా పేపర్‌లెస్‌గానే పని జరుగుతుంది. దీంతో సమయం ఆదా కావడంతోపాటు పనులను త్వరితగతిన పూర్తి చేసే వీలుంది. ఇంతకు ముందు మ్యానువల్ విధానంలో పనికి కావాల్సిన మెటీరియల్ లిస్ట్‌ను ప్రింట్ తీసుకొని, వాటిపై సంతకాలు తీసుకొని ఆ ఫైల్‌ను సంబంధిత అధికారికి అందచేసి సామగ్రిని తీసుకోవాల్సి వచ్చేది. ఈ విధానంలో కొంత జాప్యం, మెటీరియల్ సకాలంలో అందక పనులు పూర్తి చేసేందుకు సమయం పట్టేది. ఈ సమస్యను అధిగమించడానికే సీఎండీ వరుణ్‌రెడ్డి ఈ- స్టోర్‌కు రూపకల్పన చేయగా ఎస్పీఏపీ బృందం రూపొందించింది.
సులువుగా మెటీరియల్ బదలాయింపు
ఏదయినా ఓ పనికి సంబంధించిన మెటీరియల్ మిగిలి ఉంటే వేరొక పనికి వినియోగించేలా ఆన్లైన్లోనే సులువుగా మార్చుకొనే వెసులుబాటు ఉంది. ఈ పద్ధతిలో సమయం కలిసి రానుంది.
సాంకేతికతతో త్వరితగతిన పనులు
అందుబాటులోకి వచ్చిన ఈ-స్టోర్ సాంకేతికతతో వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించే వీలుంది. మెటీరియల్ సమాచారంతోపాటు జారీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఈ విధానంతో విద్యుత్ శాఖకు, వినియోగదారులకు మేలు చేకూరనుంది.
– వడ్లకొండ గంగాధర్, ఎస్ఈ-కరీంనగర్ సరిల్