కరీం‘నగరం’లో డంప్ యార్డు చిచ్చురగులుతున్నది. రోజురోజుకూ నగరప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఓవైపు బయోమైనింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం, మరోవైపు నిత్యం మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపిస్తుండడంతో ఆటోనగర్, కోతిరాంపూర్, అలకాపురి ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతున్నది.
తరచూ అగ్నిప్రమాదాలు.. చెలరేగుతున్న జ్వాలలు
పొగ, వాసనతో శివారు ప్రజలకు అవస్థలు
రాత్రివేళ ఇండ్లలో ఉండలేని పరిస్థితి
మండిపడుతున్న నగరప్రజానీకం
డంప్‌యార్డు మాకొద్దంటూ ఆందోళనబాట
రోజుకో కాలనీ చొప్పున నిరసన
కరీం‘నగరం’లో డంప్ యార్డు చిచ్చురగులుతున్నది. రోజురోజుకూ నగరప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఓవైపు బయోమైనింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం, మరోవైపు నిత్యం మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపిస్తుండడంతో ఆటోనగర్, కోతిరాంపూర్, అలకాపురి ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ చెత్తకేంద్రం మాకొద్దని, ఇక్కడి నుంచి తరలించాలని ఆందోళన బాటపట్టింది. ‘డంప్ యార్డు బాధితుల సంఘం’ పేరిట వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకొని.. రోజుకో కాలనీ చొప్పున నిరసనలు చేపడుతున్నది. ‘డంప్ యార్డు హటావో.. హమ్కో బచావో’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కార్పొరేషన్, మే 4: కరీం‘నగర’ శివారులోని ఆటోనగర్ సమీపంలో తొమ్మిదెకరాల విస్తీర్ణంలో ఉన్న డంప్ యార్డు నగరాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నది. కొద్దిరోజులుగా ఊపిరి సలుపకుండా చేస్తున్నది. ఏటా వేసవి వచ్చిందంటే చాలు అగ్ని ప్రమాదాలు జరగడం, ఫలితంగా కాలుష్యం కావడంతోపాటు వచ్చే పొగ మూలంగా సమీపంలోని కాలనీల ప్రజలందరూ తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, మరోవైపు బయోమైనింగ్ ప్రక్రియ ఆదిలోనే ఆగిపోవడం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డు ను ఇక్కడి నుంచి తొలగించాలని, లేదంటే బయోమైనింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
‘డంప్ యార్డు హటావో.. హమ్కో బచావో’ ఉద్యమం
డంప్ యార్డులో ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన చెత్తతో ఓ వైపు దుర్వాసన రావడం, మరోవైపు మంటలు అంటుకొని చెలరేగే పొగతో ఆటోనగర్, కోతిరాంపూర్, అలకాపురి దాని సమీపంలో అనేక కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సార్లు కాపువాడ, హౌసింగ్‌బోర్డు, గాయత్రీనగర్, లక్ష్మీనగర్ వరకు పొగ వ్యాపించిన సందర్భాలున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చి, పొగను అరికట్టే విషయంలో నగరపాలక ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విసిగి వేశారిన ప్రజలు ఆందోళన బాటపట్టారు. డంప్ యార్డు బాధితుల సంఘం పేరిట వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి, చుట్టు పక్కల ఉన్న కాలనీ ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నారు.
తమ సమస్యపై జిల్లా అధికారులు స్పందించే దాకా రోజువారీగా నిరసనలు చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఈ మేరకు నాలుగు రోజుల కింద అలకాపురి కాలనీ ప్రజలు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కోతిరాంపూర్ దాకా ర్యాలీ తీయడంతోపాటు ధర్నా చేశారు. రెండోజుల కింద వరసిద్ది నగర్ కాలనీ ప్రజలు కోతిరాంపూర్ నుంచి డంప్ యార్డు దాకా ర్యాలీ తీసి నిరసన తెలిపారు. ఇలాగే ఈ ప్రాంతంలోని ప్రజలు ప్రతి రోజూ నిరసన కార్యక్రమం చేపట్టే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ముందుకు సాగని బయో మైనింగ్
డంప్ యార్డులో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్తను బయోమైనింగ్ ద్వారా పూర్తిగా క్లీన్ చేసేందుకు మూడేండ్ల క్రితం ప్రణాళికలు సిద్ధం చేశారు. 16 కోట్ల వ్యయంతో టెండర్లు నిర్వహించి హైదరాబాద్‌కు చెందిన సంస్థకు అప్పగించారు. ఏడాదిలోగా పని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ పనులు ప్రారంభించిన కొద్దిరోజులకే ఆగిపోయాయి. అధికారుల పట్టింపులేమి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అయితే కొద్దిరోజులుగా స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటీవలే పనులు ప్రారంభించినా, నత్తనకడన చేపడుతున్నారనే విమర్శలున్నాయి.
ఇండ్లలో ఉండలేకపోతున్నాం
మా డివిజన్‌కు డంప్ యార్డు పెద్ద సమస్యగా మారింది. నిత్యం వచ్చే పొగతో ఇండ్లలో ఉండలేని పరిస్థితి. శ్యాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల కేంద్ర మంత్రి వచ్చి డంప్ యార్డును తొలగిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఒక్క అడుగు కూడా పడలేదు. ఇప్పటికైనా బయో మైనింగ్ పనులు వేగంగా చేపట్టి, సమస్యను పరిష్కరించాలి. లేదంటే డంప్‌యార్డును తొలగించాలి.
– ఐలేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్
అనారోగ్యం బారిన పడుతున్నాం
డంప్ యార్డు నుంచి వస్తున్న పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలబారిన పడుతున్నారు. రాత్రి పూట ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఏళ్ల తరబడిగా డంప్ యార్డు అక్కడే ఉందని చెబుతున్న అధికారులు, పొగను నివారించేందుకు కనీస చర్యలు తీసుకోకపోవడం సరికాదు. ఇప్పటికైనా తమ కాలనీ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి.
– వెంకట్, కోతిరాంపూర్
వెంటనే చర్యలు చేపట్టాలి
డంప్ యార్డు పొగ సమస్య పరిష్కారానికి జిల్లా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. ఇండ్లలో ఉండలేకపోతున్నాం. అనేక అవస్థలు పడుతున్నాం. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. చెత్త తొలగింపు పనులు చేస్తున్నామని చెబుతున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు చొరవ చూపాలి.