గంభీరావుపేట, ఆగస్టు 3: ఓవైపు సాగునీరు రాక.. మరోవైపు కరెంట్ లేక వానకాలం పంటలు ఎండుతున్నాయి. నాటేసిన పొలాలు పదిహేను రోజులకే నెర్రెలు బారి పోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారు ఖుర్ధులింగంపల్లి ప్రాంతంలో లో ఓల్టేజీతో వారం క్రితం ట్రాన్స్ఫార్మర్ చెడిపోయింది. రెండు రోజుల క్రితం కొత్తది ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. వ్యవసాయబావి మోటర్లు ఆన్ చేయడంతో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఫీజు వైర్లు రెండు, మూడు గంటలకోసారి కొట్టేస్తున్నాయి.
దీంతో రైతులు వచ్చి ఫీజు వైరు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పొద్దంతా పొలాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. మోటర్లు ఆన్ చేసి కొద్ది సేపటికే బంద్ అవుతుండడంతో నీళ్లు పారడం లేదని, పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోతున్నారు. నెర్రెలు వారుతున్న పొలాలను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోఓల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని వేడుకుంటున్నారు.