Dharmapuri police station | ధర్మపురి, జూన్ 30: ధర్మపురి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జియో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ధర్మపురికి చెందిన గడిపెల్లి గోపాల్ అనే వ్యక్తి ఓ టెంట్ హౌజ్ లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే సోమవారం తన బార్య నర్సమ్మతో గొడవపడ్డాడు. గొడవ కారణంగా మద్యం సేవించాడు. తాగిన మైకంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జియో సెల్ టవర్ పైదాకా ఎక్కాడు. అక్కడి నుండి దూకి ఆత్మహత్యాప్రయత్నం చేయగా.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి వెంటనే స్పందించి సిబ్బందితో కలిసి సెల్ టవర్ వద్దకు వెళ్లి పరిస్థితిని గమనించి ఫైర్ ఇంజన్ కు సమాచారమందించి ఫైరింజన్లో ఉన్న వైర్లెస్ మైక్ సెట్ ద్వారా గోపాల్ కూతురు పింకి, భార్య నర్సమ్మతో కిందికి దిగి రావాలని మైక్ సెట్ ద్వారా మాట్లాడించాడు. కిందికి దిగిరావాలని సీఐ కూడా మైక్ సెట్ ద్వారా గోపాల్ కు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు గోపాల్ కిందకు దిగి వచ్చాడు. ఈ ఘటనతో పట్టణంలో దాదాపు గంటన్నర పాటు ఉత్కంఠ నెలకొన్నది. కిందికి దిగి వచ్చిన గోపాల్ను పోలీస్ వాహనంలో దవాఖానకు తరలించారు. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన సీఐ రాంనర్సింహారెడ్డిని, పోలీస్ సిబ్బందిని, ఫైర్ సిబ్బందిని పట్టణవాసులు అభినందించారు.