Karimnagar CP Ghaus Alam | గంగాధర, మార్చి 28 : కంటి పరీక్షలు చేయించుకొని వాహనాల డ్రైవర్లు రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గంగాధర లయన్స్ క్లబ్ సహకారంతో శనివారం గంగాధర మండలం మధురానగర్ లోని వీఏఎస్ గార్డెన్ లో అలైవ్, అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గంగాధర మండలంలోని బస్సు, లారీ, వ్యాన్, ఆటో తదితర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కమిషనర్ గౌస్ ఆలం కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిపుణులైన వైద్యులు డ్రైవర్లకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి సూచనలు ఇచ్చారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో కంటి చూపు కీలకమని పేర్కొన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ప్రయాణికుల భద్రతను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు. కంటి వైద్య శిబిరం ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ రవికుమార్, రజిని, ఎంపీడీఓ రాము, తహశీల్దార్ రజిత, సర్కిల్ ఎస్ఐలు వంశీకృష్ణ, రాజు, నరేష్ రెడ్డి, సర్పంచులు వేముల భాస్కర్, ముద్దం నగేష్, రేండ్ల శ్రీనివాస్, దూలం కళ్యాణ్, బీర్ల ఆనందం, ఎట్టెకు కనకయ్య, కడారి రేణుక కనకయ్య, కొలెపాక కవితా మల్లేశం తదితరులు పాల్గొన్నారు.