ఇంకా వేసవి ఆరంభం కానేలేదు. ఎండలు ముదరనే లేదు. కానీ, అప్పుడే కరీం‘నగరం’లో నీటి కటకట మొదలైంది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది. పది పదిహేను రోజులుగా హైలెవల్ జోన్‌లోని ఏడు డివిజన్ల ప్రజలు నల్లానీరు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తుండడం, అది లోప్రెషర్‌తో ఇస్తుండడంతో సరిపోక ట్యాంకర్ల కోసం పడిగాపులు గాస్తున్నారు. గతంలో కేసీఆర్ సర్కారు అర్బన్ మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు తీర్చిందని, మండుటెండల్లోనూ ప్రతి రోజూ నీటిని సరఫరా చేసిందని గుర్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ గోసపడే రోజులు వచ్చాయని, ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేషన్, మార్చి 1 : ఒకప్పుడు కరీంనగరంలో నీటి కటకట తీవ్రంగా ఉండేది. ఎండాకాలం వచ్చిదంటే చాలు ప్రజలు చాలా ఇబ్బంది పడేది. రోజు విడిచి రోజు గంటపాటు నీటిని సరఫరా చేసినా.. అవి లో ప్రెషర్‌తో రావడం వల్ల ఎటూ సరిపోకపోయేవి. హైలెవల్ జోన్లో సమస్య ఎక్కువగా ఉండేది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చేది. నగర జనాభాకు అనుగుణంగా ప్రణాళిక లేకపోవడం, ఎల్ఎండీలో నీరు తగ్గడం వల్లే సమస్య ఎదురైనా ఎవరూ పట్టించుకునేది కాదు. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేది కాదు. కానీ, కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం చూపింది.
అర్బన్ మిషన్ భగీరథ కింద 110 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేసి, ప్రతి రోజూ గంటపాటు తగినంత ప్రెషర్‌తో మంచినీటిని సరఫరా చేసింది. ఎల్ఎండీలో నీటి మట్టం తగ్గినప్పుడు ఎగువ శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి నీటిని విడుదల చేసి మరీ ఇబ్బందులు రాకుండా చూసింది. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. నాలుగైదేండ్లుగా తాగునీటి సరఫరా సక్రమంగానే సాగినా.. ఈ సారి మాత్రం సమస్య అప్పుడే మొదలైంది. ఒకప్పుడు ఏటా ఏప్రిల్ లేదా మేలో కొరత మొదలైనా.. ఇప్పుడు ప్రజలు ఫిబ్రవరి నుంచే ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ప్రధానంగా కోర్టు రిజర్వాయర్ పరిధిలోకి వచ్చే హైలెవల్ జోన్లో ముప్పు ఎక్కువగా కనిపిస్తున్నది. కోర్టు, విద్యానగర్, రాంనగర్, ఎస్ఆర్ఆర్, అంబేద్కర్‌నగర్ రిజర్వాయర్ పరిధిలో నీటి సరఫరాకు ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయని ఇంజినీరింగ్ అధికారులే చెబుతున్నారు.
ఇప్పటికే ఏడు డివిజన్లలో సమస్య ఉత్పన్నం కాగా, హై లెవల్ జోన్ పరిధిలోని 17, 38, 39, 56, 22 డివిజన్లతోపాటు సీతారాంపూర్, ఆరెపల్లి సమీపంలోని అనేక కాలనీలకు పది రోజులుగా రోజు విడిచి రోజు మంచినీరు ఇస్తున్నారు. ప్రస్తుతం ఎల్ఎండీలో 8 టీఎంసీల కంటే కూడా తక్కువగా ఉండడంతో రా వాటర్ తీసుకోవడానికి బూస్టర్ పంపులను వాడుతున్నారు. ఫిల్టర్‌బెడ్ నుంచి మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేసేందుకు మోటర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయినా వల్ల ఆయా రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపలేకపోతున్నారు.
ఈ కారణంగానే నీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతుండగా, ఆయా డివిజన్ల ప్రజలు ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. 22వ డివిజన్‌తోపాటు సుభాష్‌నగర్, నూతన కుర్మవాడ, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా నీరందించే దుస్థితి వచ్చింది. ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గితే ముప్పు మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా హై లెవల్ జోన్లో 40 డివిజన్లలోనూ సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.
హైలెవల్ జోన్లో నీటి కటకటతో ఏడు డివిజన్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదేండ్ల తర్వాత సమస్య మొదలైందని వాపోతున్నారు. గతంలో ఎన్నడూ ట్యాంకర్ల కోసం చూడలేదని, ఇప్పుడు మాత్రం ఎదురుచూడాల్సి వస్తున్నదని చెబుతున్నారు. మార్చి మొదటివారంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెల ల్లో తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మున్ముందు ఎండలు ముదురుతాయని, భూగర్భ జలాలు పడిపోతాయని, బోర్లలోనూ అడుగంటుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గిందని అధికారులు చేతులెత్తేస్తున్నారని విమర్శిస్తున్నారు. కానీ, గతంలో ఎల్ఎండీలో నీళ్లు తగ్గినప్పుడు మిడ్‌మానేరు నుంచి నీటిని విడుదల చేసి సమస్యరాకుండా చూసేవారని గుర్తు చేస్తున్నారు. ఈ సారి అలా ఎందుకు చేయడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, ప్రతి రోజూ నీరందించాలని కోరుతున్నారు.
ఎల్ఎండీలో నీటిమట్టం తక్కువగా ఉండడం వల్లే పలు డివిజన్లల్లో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే రా వాటర్ కోసం బూస్టర్ పంపులను వినియోగిస్తున్నాం. మోటర్ల సమస్య వల్ల నీటి ఇబ్బందులు ఉంటున్నాయి. ఎల్ఎండీలోకి మిడ్‌మానేరు నుంచి నీటి విడుదల చేయాలని కోరుతున్నాం. వేసవిలో నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– మహేందర్, ఈఈ (కరీంనగర్ కార్పొరేషన్)
మా 22వ డివిజన్ పరిధిలో పదిహేను రోజుల నుంచి రోజు విడిచి రోజు మంచినీరు ఇస్తున్నారు. ఎల్ఎండీలో నీరు లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. మూడేళ్లుగా ఎక్కడ కూడా సరఫరాలో ఇబ్బంది రాలేదు. ఇప్పుడు ఫిబ్రవరి నుంచే అనేక కాలనీలకు రోజు విడిచి రోజు వస్తున్న నల్లా నీటిలోనూ తగినంత ప్రెషర్ రావడం లేదు. దీంతో ఆయా కాలనీలకు ట్యాంకర్లను పంపించాల్సి వస్తున్నది. ట్యాంకర్లను పంపించాలని అధికారులను కోరుతున్నా సరిగ్గా పంపడం లేదు. వెంటనే అధికారులు స్పందించాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచినీటి సరఫరాను మెరుగుపర్చాలి.
– గంట కల్యాణి, 22వ డివిజన్ కార్పొరేటర్ (కరీంనగర్)