Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 28: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందితోపాటు వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం చల్లని తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఫ్రిజ్ చూడండి ఎలా ఉందో.. కార్యాలయంలోని సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట గల ఈ ఫ్రిజ్ చుట్టంతా గలీజు చెత్త పేరుకుపోయింది. ఎవరో తెలియదు కానీ గుట్కాలు నమిలి అక్కడే ఉమ్మివేస్తుండటంతో అపరిశుభ్రంగా తయారైంది.
స్వచ్ఛత, పరిశుభ్రతపై నగర పాలక అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న క్రమంలో తమ కార్యాలయంలో మాత్రం ఇలాంటి పరిస్థితి చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. ఆయా పసుల నిమిత్తం కార్యాలయంకు వచ్చే స్వశక్తి మహిళలు గానీ, ఇతరులు గానీ దాహం వేసి చల్లటి నీరు తాగుదామని ఆ ఫ్రిజ్ వద్దకు వెళ్లేసరికి అపరిశుభ్రంగా ఉండటంతో వెనుదిరిగి వెళ్తున్నారు. కార్యాలయంలో పని చేసే సిబ్బంది ఆడుతూ పాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.