Drinking water | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 14 : జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడి పోతున్నాయి. బోర్లు, బావులు నీటి జాడ లేక వట్టిపోతున్నాయి. మార్చి నెలాఖరు వరకు 8.10 మీటర్ల కిందికి వెళ్లాయి. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నెలలో పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతున్నది. జిల్లాలో గతంలో పుష్కలంగా ఉన్న పాతాళగంగ ఇప్పుడు అడుగంటుతున్నది. ఇంతకు ముందు ఐదు మీటర్ల లోతులోనే నీళ్లు ఉండగా, ప్రస్తుతం రెట్టింపు స్థాయిలో కిందికి వెళ్లాయి. జిల్లాలో 2024 మార్చిలో 7 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఈ మార్చిలో 8.10 మీటర్ల లోతుకు చేరాయి. ఫిబ్రవరిలో 7.63 మీటర్ల దూరంలో ఉండగా.. నెల వ్యవధిలోనే మీటరు లోతు మేర పడిపోయాయి. నెల నెలకు మీటరు నుంచి రెండు మీటర్ల కిందికి వెలుతుండటం ఆందోళన కలిగించే అంశమని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
మండలాల వారీగా..
జిల్లాలో 16 మండలాలు ఉండగా.. గతేడాది మార్చి నెలతో చూస్తే చిగురుమామిడి, ఇల్లందకుంట, కేశవపట్నం మండలాలు మినహా మిగతా మండలాల్లో భూగర్భ జల మట్టం తగ్గింది. అత్యధికంగా గంగాధర మండలంలో అత్యధిక లోతుకు ఇంకగా, ఏకంగా 15.31 మీటర్ల మేర కిందికి నీళ్లు పడి పోయాయి. గతేడాది 16.57 మీటర్లలో నీళ్లు ఉండగా, ఈసారి 1.26 మీటర్ల లోతుకు పడిపోయాయి. చొప్పదండిలో 14.81 మీటర్లు, రామడుగు లో 11.10మీటర్లు, కరీంనగర్ పట్టణంలో 10.60 మీటర్లు, గన్నేరువరంలో 9.71, కొత్తపల్లిలో 9.32, హుజురాబాద్ లో 8.88, తిమ్మాపురం 8.82, సైదాపూర్‌లో 6.13, కరీంనగర్ రూరల్ లో 5.15, వీణవంకలో 4.68, జమ్మికుంటలో 4.21, మనకొందుర్ 2.96 మీటర్ల లోతుకు వెళ్లినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తాగు, సాగు నీటికీ తండ్లాటే…
జిల్లాలో లక్షలాది ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. అధికంగా వరి వేశారు. జిల్లాలో వేల సంఖ్యలో బోరు బావులు ఉన్నాయి. వీటి కింద అత్యధికంగా వరి సాగు చేస్తున్నారు. ఈసారి వానకాలంలో వర్షపాతం సాధారణంగానే నమోదైనప్పటికీ, యాసంగి సాగు విస్తీర్ణం పెరుగడంతో బోరు బావుల ద్వారా నీటి వినియోగం పెరిగింది. ఇప్పటికే పలు ఏరియాల్లో బోర్లలో నీటి ధారలు తగ్గాయి. దీంతో పంటలు కూడా ఎండిపోతున్నాయి. మరో వైపు తాగు నీటికి సైతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా సరఫరా అయ్యే తాగు నీరు సక్రమంగా రాకపోవటంతో మినరల్ వాటర్ సరఫరాదారులపై ఆధారపడుతున్నారు. వారు ఇష్టారాజ్యంగా సప్లై చేస్తుండటంతో వాటర్ క్యాన్ల కోసం ఇళ్లముందు పడిగాపులు కాస్తుండే దృశ్యాలు జిల్లావ్యాప్తంగా సర్వసాధారణమయ్యాయి. ఏప్రిల్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే మేలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.