జమ్మికుంట, జనవరి 15: జమ్మికుంటలో ఆమ్లెట్ కోసం మందుబాబులు తన్నుకున్నారు. నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకున్నారు. మూడు వర్గాలు రెండు గంటలపాటు హంగామా సృష్టించగా.. చివరకు పోలీసులు లాఠీఛార్జీ చేసి ఆకతాయిలను చెదరగొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం చౌరస్తా సమీపంలో ఓ బిర్యానీ, ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, ఓ వైన్ షాపు ఉంది. సోమవారం రాత్రి ఒక వ్యక్తి మద్యం తాగి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వచ్చాడు.
ఆమ్లెట్ కావాలని అడిగాడు. నిర్వాహకులు లేదని చెప్పడంతో మాటల యుద్ధం మొదలైంది. బూతులు తిట్టుకున్నారు. అనంతరం దాడులు చేసుకున్నారు. మందుబాబులు తమ స్నేహితులకు సమాచారం అందించి పిలిపించారు. వచ్చిన వారంతా కొట్లాటకు దిగారు. పక్కనే ఉన్న వైన్ షాపులోని కొందరు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గొడవను ఆపే ప్రయత్నం చేశారు. వారిపై కూడా దాడులు జరిగాయి. సదరు వ్యక్తులకు సంబంధించిన ఓ గ్రూపు వచ్చింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. హుజూరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఇనుప రాడ్లు పట్టుకుని, బీరు సీసాలు పట్టుకుని దాడులకు తెగబడుతూ హల్చల్ చేశారు.
రోడ్ల మీద ఎవరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. బెదిరింపులకు గురిచేశారు. ఈ ఘటనపై అందిన సమాచారంతో వెంటనే నలుగురు పోలీసులు అక్కడకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అదుపులోకి రాకపోవడంతో అదనపు ఫోర్స్‌ను ఘటనాస్థలానికి పిలిచారు. లాఠీఛార్జీతో మందుబాబులను చెదరగొట్టా రు. పది మందిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ రవి తెలిపారు. కాగా, నడిరోడ్డుపై రెండుగంటలపాటు సాగిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇక్కడే అనేకసార్లు గొడవలు జరిగాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.