జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 5: పాత బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ దవాఖాన అప్పుడెట్లుండె.. ఇప్పుడెట్లయిం దో చూడాలని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్ట ర్ సంజయ్‌కుమార్ అన్నారు. పాత బస్టాండ్‌లో ఇరుగ్గా ఉన్న ప్రభుత్వ దవాఖానను అభివృద్ధి చేశానని, రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయించి పేదల చెంతకు సర్కారు వైద్యాన్ని తెచ్చామని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని దేవీశ్రీ గార్డెన్లో ఆదివారం పూసాల సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాత బస్టాండ్ వద్ద సరైన వసతులు లేక ఇరుకైన భవనంలో ప్రభుత్వ దవాఖాన ఉండేదని, దానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పారు. నేడు సీటీస్కాన్‌తోపాటు ఎన్నోరకాల వైద్య పరీక్షలు చేసే స్థాయికి తీసుకువచ్చామన్నారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో ప్రభుత్వ దవాఖానలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ధరూర్ క్యాం పులో 100 పడకలతో నూతన దవాఖానను నిర్మించామని అదేవిధంగా 650 పడకల సామర్థ్యం గల ప్రభుత్వ మెడికల్ కళాశాలను సైతం తీసుకువచ్చామన్నారు.
పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యనందించే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవించే పూసాల కులస్తుల సమస్యలను పరిష్కరిస్తానని, టీఆర్‌నగర్‌లో జిల్లా పూసాల సంఘ భవనానికి 20 గుంటల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ప్రతి మహిళకు రూ. 3వేల పెన్షన్‌ను అందిస్తామని, కేసీఆర్ బీమా పేరుతో ప్రతి పేద వ్యక్తికి రూ.5 లక్షల బీమా అందిస్తామని, దశల వారీ గా ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచుతామన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మవద్దని, మరోసారి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో తొలిప్రేమ శ్రీనివాస్, చైని సురేందర్, కిషన్, నగేశ్, తిరుమలేశ్, తిరుపతి, నవీన్, తన్నీరు పవన్, దీపక్, సంపత్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్, నవంబర్ 5: బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి ఆలయ చైర్మన్ నేరెల్ల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమక్షంలో 30 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం బీర్పూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.