కోరుట్ల, మార్చి 25: పెరటి కోళ్ల పెంపకంతో గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేయాలని పశు వైద్యశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పీవీ నరసింహారావు పశు వైద్య కళాశాల ఆధ్వర్యంలో జాతీయ మాంస పరిశోధన సంస్థ సహకారంతో పెరటి కోళ్ల పెంపకంతో ఆర్థిక అభివృద్ధి, పోషణ ఆహార భద్రత అనే అంశంపై కోళ్ల శాస్త్ర విభాగం అధ్వర్యంలో మంగళవారం రైతులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ దేశ జనాభాలో 70 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్థికంగా వెనుక బడిన గ్రామీణ పేదలకు, గిరిజనులకు కోళ్ల ఉత్పత్తి ద్వారా లభించే గుడ్లు, మాంసం వంటి జంతు సంబంధమైన మాంసకృత్తులు తగిన స్థాయిలో లభించడం లేదన్నారు. దేశంలో గుడ్లు, మాంసం ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరగడం లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆశాజనకమైన మార్పులు రావాలంటే పెరటిలో పెరిగే రాజశ్రీ, గ్రామప్రియ, శ్రీనిధి, వనశ్రీ జాతి కోళ్ళను పెంచుకోని స్వయం ఉపాధికి బాటలు వేసుకోవాలన్నారు. ప్రజలకు పౌష్టికాహారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరటి కోళ్ల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధ్యాపకులు దైదా కృష్ణ ప్రసాద్, రాంబాబు, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.