పెద్దపల్లి టౌన్, అక్టోబర్ 8 : ప్రభుత్వం దళిత విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని బెస్ట్ అవైలబుల్ పథకం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేడుకున్నారు. సర్కారు నుంచి రావాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సీపీఏం పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యుడు కల్లెపల్లి అశోక్ మాట్లాడారు.
పెద్దపల్లి జిల్లాలోని ఎనిమిది ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు వెయ్యి మందికిపైగా దళిత విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా చదువుతున్నారని, రెండేళ్ల నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను పాఠశాల్లోకి అనుమతించడంలేదని వాపోయారు. దళిత విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నాయకులు సీపెల్లి రవీందర్, బాలసాని లెనిన్, ఆర్ల సందీప్, మోదుంపల్లి శ్రావన్, కన్నూరి శ్రీశైలం, బొటుకు రమేశ్, మాడుగుల రజిత, శ్యామల పాల్గొన్నారు.
ఫీజు కట్టాలని ఒత్తిడి తెస్తున్నరు
ప్రభుత్వం రెండేళ్లుగా బకాయిలు చెల్లించని కారణంగా ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు ముందుగా పిల్లల ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నరు. ప్రభుత్వం తిరిగి నిధులు విడుదల చేసిన తర్వాత తీసుకోవాలని నిబంధనలు పెడుతున్నరు. దీంతో దళిత విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నరు. ప్రభుత్వమే తక్షణం స్పందించాలి. బకాయిలు వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులను ఆదుకోవాలి.
– శ్యామల, బెస్ట్ అబైలబుల్ విద్యార్థి తల్లి (పెద్దపల్లి)