Dharmaram | ధర్మారం, డిసెంబర్ 3 : ధర్మారం మండల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఎంఈవో పోతు ప్రభాకర్ కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ పిల్లల్లో ఉత్సాహాన్ని ప్రేరేపించడానికి దివ్యాంగ పిల్లల విజయగాథల వీడియోలను ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమానికి తహసీల్దార్ శ్రీనివాస్ హాజరై దివ్యాంగ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
సంకల్పం ముందు అంగవైకల్యం అడ్డురాదని, ప్రపంచంలో ఎంతోమంది దివ్యాంగులు వివిధ రంగాల్లో ఎంతో ప్రతిభను కనభరిచి తమకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలుపుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు కల్పించే అన్నిరకాల సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగ పిల్లలను కంటికి రెప్పలా కాపాడి ఎప్పుడు తమకు రక్షణ కల్పిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యారాలు శ్రీమతి షీలా, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డి, ఫిజియోథెరపీ డాక్టర్ దిలీప్, వ్యాయామ ఉపాధ్యాయురాలు మమత, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఐఆర్పీ రమ్య, ఎంఐఎస్ సునీత, సీసీవో సురేష్, సీఆర్పీలు కవిత, శ్రీలత, ప్రేమ్ సాగర్,కుమారస్వామి, మెసెంజర్ రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.