Collector Koya Sri Harsha | పెద్దపల్లి, జూలై 7: ప్రజావాణి ఆర్టీలను పెండింగ్ పెట్టోద్దని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజవాణిలో అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఆర్జీదారులను నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
15 లోపు దరఖాస్తు చేసుకోవాలి
ఈనెల 15 లోపు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ, మానిటరింగ్ కమిటీలో సభ్యత్వం కోసం ఆసక్తి అర్హత గల ఎస్సీ, ఎస్టీ చెందిన అభ్యర్థులు ఈనెల 15 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. కమిటీలో ఎన్నికైన సభ్యులకు ఎలాంటి పారితోషకాలు ఉండవని స్పష్టం చేశారు.
మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
జిల్లాలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈనెల 7-9 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటి వనరులలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.