Dongaturthi | ధర్మారం, ఫిబ్రవరి 13 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన దారంగుల సురేష్ కుటుంబానికి గ్రామస్తులు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి భార్య శారదతో పాటు కూతురు దివ్య (7) , కుమారుడు లోకేష్ ( 9) సంతానం ఉన్నారు. మృతుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ కుటుంబానికి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేసి అండగా నిలవాలని స్థానికులు నిర్ణయించారు.
దీంతో గ్రామస్థులు, మిత్రులు, తదితరులు కలిసి రూ.50వేల విరాళాలు పోగు చేశారు. ఈ నేపథ్యంలో ఆ సొమ్మును శుక్రవారం బాధిత కుటుంబానికి అందజేశారు. సహాయం అందించిన గ్రామస్తులకు మృతుడు సురేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 12 వ వార్ఢు సభ్యురాలు పల్లపు స్వరూప-శంకర్, వేల్పుల శంకర్, పల్లపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.