water problems | చొప్పదండి, ఏప్రిల్ 11: సాగునీళ్లు లేక చేతికి అందించిన పంట రైతుల కళ్ళముందే ఎండి నష్టపోయే దుస్థితి వచ్చిందని, వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి దాపురించినా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రశ్నించారు. మండలం రాగం పేటలో నీళ్లు లేక పంట నష్టపోయిన ప్రాంతాలను, సమస్యలతో కోట్టుమిటాడుతున్న ఇరిగేషన్ ప్రాంతాలను కృష్ణారెడ్డి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాగంపేట గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ భూములు ఎల్లంపల్లి పైప్ లైన్ గేటువాల్వ్ ద్వారా 200 ఎకరాలు , శనగకుంట, పుల్లయ్యకుంట వంటి కుంటలు నింపడం ద్వారా దాదాపు 550 ఎకరాల భూమి కి సాగు నీళ్ళు వినియోగమయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. భూగర్భ జలాలు పెరిగి కుంటల కింద ఉన్న కాలువలు ద్వారా నీరు అంది సాగయ్యే భూములు ఉన్నాయన్నారు. రాగంపేట శివారులో ఉన్న ఎల్లంపల్లి పైప్ లైన్ గేట్ వాల్వ్ చెడిపోయిందని రెండు సంవత్సరాల నుంచి రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి మండల పరిషత్ సమావేశంలో ప్రస్తావించినా కూడా ఫలితం లేకపోవడం దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు, ముఖ్యంగా ఎల్లంపల్లి కి సంబంధించిన గేట్ వాల్వ్ రిపేర్ చేయించడానికి నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చేతికి అంది వచ్చిన పంటను రక్షించుకోలేక నేడు రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు.
రాగం పేటలో కోమటికుంట పుల్లయ్యకుంట కింద ఉన్న 500 ఎకరాల పొలాలలో సుమారు 30 ఎకరాల వరకు బీడు భూములుగా మారిపోయాయనీ, మరో ముప్పై ఎకరాలలో నీరందక పంటలుపూర్తిగాదెబ్బతిన్నాయన్నారు. అంతేకాక రాగంపేట ఎస్సీ కాలనీ తో పాటు గ్రామానికి నీరు అందించే కోమటికుంట లోని తాగు నీటి బావి లో నీటిమట్టం తగ్గిపోయిందని, వేసవిలో తాగునీటికి గడ్డ కాలం ఎదురయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తక్షణ చర్యలు చేపట్టాలని, రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మొగిలి మహేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్ కుమార్, ఆడిచర్ల రాజు, మాజీ అసెంబ్లీ కన్వీనర్ మొగిలి సారయ్య, మాజీ ఎంపీటీసీ తోట కోటేష్, మాజీ ఉపసర్పంచ్ కిట్టు గౌడ్, మాజీ మండలాధ్యక్షులు మావురం సుదర్శన్ రెడ్డి, సింగిరెడ్డి భూమిరెడ్డి, పాకాల మహేష్, గుండె వెంకటేష్, గసిగంటి రవి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.