T Jeevan Reddy | రాయికల్, మే 25 : ప్రజా పాలన అంటే కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని సైతం కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టడమేనా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాయికల్ పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీసు రోడ్డు వద్ద మొక్కజొన్న కొనుగోళ్ల జాప్యం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని, ధాన్యం డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సంఘీభావం తెలిపి రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలకు రైతులకు అధికారులు అందుబాటులో లేకుండా ఉండడమేనా..? ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు.
ప్రభుత్వం బాధ్యత వహిస్తే వరి, మొక్కజొన్న ఏ పంట అయినా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడలేదన్నారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే నడిరోడ్డు పైన యుద్ధం చేయాల్సి వస్తోందని చెప్పారు. ఉత్తర తెలంగాణలో వరి ధాన్యానికి బదులు రబీలో ప్రభుత్వం అధికారుల సూచన మేరకు మొక్కజొన్న, ఇతర పప్పు దినుసులను రైతులు సాగు చేస్తున్నారన్నారు. రైతులు 40 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే ప్రభుత్వం కేవలం క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తానంటే మిగిలిన 15 క్వింటాళ్ల ధాన్యాన్ని రైతు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు.
మిగిలిన ధాన్యం కోసం రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతులు కొందామంటే యూరియా దొరికే పరిస్థితి లేదన్నారు. దేశంలో లేని సమస్యలు కేవలం తెలంగాణలో మాత్రమే కనిపిస్తున్నయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా ఎకరానికి 6 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే అధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో సిగ్గుపడాలన్నారు. ఇక్కడ పెట్రోల్ పై 35 శాతం, డీజిల్ పై 27 శాతం వ్యాట్ ఉందని, ఈ శాతం వ్యాట్ ఎక్కడా లేదని మండిపడ్డారు. నార్త్ ఇండియాలో పెట్రోల్, డీజిల్ పై 19 శాతం మాత్రమే వ్యాట్ ఉందని, ఇది చాలదన్నట్టు కాంగ్రెస్ నాయకులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పై రోడ్డెక్కి ధర్నాలు చేయడం విడ్డూరమన్నారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ విషయంలో కాంగ్రెస్ ధర్నాలు చేస్తుంటే, ధాన్యం కొంట లేరని బీజేపీ ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. పెట్రోల్, డీజిల్ పెంపులో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధినేత సీఎం రేవంత్ రెడ్డి అయితే, కేంద్రంలో అధినేత ప్రధానమంత్రి మోడీ అని అన్నారు. ఇద్దరూ బాయ్ బాయ్ అనుకుంటూ పక్కపక్కనే కూర్చుని ఎకిలి నవ్వులు నవుతున్నారని, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలైనా ధాన్యం కొనుగోలు, పెంచిన పెట్రోల్,ళ డీజిల్ ధరలను తగ్గించుకున్నారా అని ప్రశ్నించారు. కొన్ని రోజులు ఓపిక పడితే మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని, అప్పుడు రైతులకు సమస్యలు ఉండబోవన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఎరువులు విత్తనాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. 20 రోజులుగా నేను పండించిన ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లోనే ఉందన్నారు. ఆటో కార్మికులకు నెల నెలా రూ.2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ వసంత మాట్లాడుతూ అధికారులు, ధాన్యం కొనుగోలు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి రెవెన్యూ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు చేసిన బ్యాగులను వెంటనే మిల్లులకు తరలించి పెండింగ్ లో ఉన్న ధాన్యం డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. అలాగే మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో లారీల కొరత లేకుండా చూడాలన్నారు. రెవెన్యూ అధికారులు రోజు ఐదు లారీలను అందుబాటులో ఉంచి తూకం వేసిన బ్యాగులను వెంటనే తరలిస్తామని, ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపి రాజిరెడ్డి, రామచంద్ర రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మలేష్ యాదవ్, అనిల్, గంగారెడ్డి, రమేష్, హరీష్ రావు, నాగరాజు, సుధాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.