జగిత్యాల, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రజాప్రతినిధులుగా, వైద్యులుగా తమకు బాధ్యత ఉందని, అందుకే ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా దవాఖానలను పరిశీలించి పరిస్థితులపై ప్రభుత్వం, సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రికి నివేదిక ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని బీఆర్ఎస్ వైద్య ఆరోగ్య త్రీమెన్ కమిటీ మెంబర్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చేందుకే హాస్పిటళ్లను పరిశీలిస్తున్నామని, తమను అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం సరికాదని సూచించారు. బుధవారం ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానతోపాటు మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. దాదాపు రెండు గంటలకుపైగా అన్ని వార్డులను పరిశీలించి,అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా రోగులు, వారి కుటుంబసభ్యులు గోడు వెల్లబోసుకున్నారు. ‘సార్ కేసీఆర్ సార్ హయాంలో వచ్చినట్లు బాలింతలకు కిట్లు, రూ.12వేల పారితోషికం వస్తే బాగుండు. అస్సలు ఇవ్వడం లేదు’ ‘పేషెంట్‌కు యూరిన్ పైపు వేసేందుకు రూ.100 వసూలు చేస్తున్నరు. ఇదేం గోస’ ‘పక్షవాతం వచ్చిన రోగికి ఒకే గోలి ఇస్తున్నరు. ఇదేం వైద్యమో..? అర్థమైతలేదు’ అంటూ చెప్పుకున్నారు. భోజనం శుచి, శుభ్రత లేదని, మూత్రశాలలు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. వ్యాధి నయమవాలని వస్తే.. ఇక్కడి కొత్త రోగాలు వచ్చే పరిస్థితి దాపురించిందని చెప్పుకోగా, ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. దవాఖాన వైద్యులు, సిబ్బందితో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం మాట్లాడారు. జగిత్యాల ప్రధాన దవాఖానను సైతం సాధారణ రీతిలోనే పరిశీలించామని, సిబ్బందికి, రోగులకు ఎక్కడ ఇబ్బందులు సృష్టించలేదని, అనవసర ఆరోపణలు సైతం చేయడం లేదన్నారు. దవాఖానలో ప్రధానంగా బెడ్స్ కొరత తీవ్రంగా ఉందని, వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యులు, స్టాఫ్ పనితీరు చాలా వరకు బాగానే ఉందని చెప్పారు. అయితే కొందరు వైద్యులు సమయ పాలన పాటించడం లేదని, కొందరు సిబ్బంది సరిగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు తమ పరిశీలనలో వెలుగులోకి వచ్చాయన్నారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రం చాలా బాగుందని, రోగులకు సౌకర్యవంతంగా, విశాలంగా ఉందన్నారు. కేసీఆర్ కిట్, 12వేల పారితోషికం చాలా ఎక్కువ ప్రభావం చూపిందని, ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 70 శాతానికి చేరిందన్నారు. అయితే కొన్నాళ్లుగా కేసీఆర్ కిట్లు, పారితోషికాలను నిలిపివేయడంతో ప్రసవాల సంఖ్య తగ్గిపోవడానికి కారణమైందని వివరించారు. సకల సదుపాయాలతో ఉన్న ఎంసీహెచ్‌లో సిజేరియన్లు ఎక్కువ కావడం సరికాదన్నారు. వసతులు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిజేరియన్లు జరిగాయంటే అర్థం ఉందని, అన్ని వసతులు ఉన్న చోట ఇలా జరగవద్దని, వీలైనంత వరకు సాధారణ కాన్పు అయ్యేలా చూడాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ దవాఖానలో భోజన తయారీ కేంద్రం అత్యంత బాధాకరమైన స్థితిలో ఉందని, అపరిశుభ్రత రాజ్యమేలుతుందని, ఇలాంటి చోట తయారయ్యే భోజనంలో లక్కపురుగులు రాకుంటే? ఏం వస్తాయని ప్రశ్నించారు. ఒక్కచోట భోజనం తయారు చేసి మరో చోటుకి తరలించడం సరిగా లేదన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా వైద్యుల సమయపాలనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి తదితరులున్నారు.